PM Modi Speech: తెలంగాణ పర్యటనలో కేసీఆర్‌కి చురకలంటించిన ప్రధాని మోదీ.. డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారా ?

PM Modi Speech In Telangana Visit: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబపాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ.. దురదృష్టవశాత్తుగా ఎవరైతే తెలంగాణ పేరు ఉపయోగించుకుని అందలం ఎక్కారో.. వాళ్లే తెలంగాణలో అభివృద్ధి మందగించేలా చేశారని అన్నారు.

Written by - Pavan | Last Updated : Nov 12, 2022, 05:58 PM IST
  • అవినీతిని సహించే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ
  • తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని విమర్శలు
  • తెలివైన తెలంగాణ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శలు
PM Modi Speech: తెలంగాణ పర్యటనలో కేసీఆర్‌కి చురకలంటించిన ప్రధాని మోదీ.. డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారా ?

PM Modi Speech In Telangana Visit: తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి చురకలంటిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నిత్యం పొద్దున లేచింది మొదలు పడుకునే రాత్రి వరకు నిరాశ నిస్పృహలతో తననే విమర్శిస్తుంటారని.. కానీ ఆ విమర్శలే తాను మరింత సమర్థవంతంగా పనిచేయడానికి పౌష్టికాహారంగా పనిచేస్తాయని, ప్రతిపక్షాల దూషణలను కూడా ప్రజా సంక్షేమం కోసమే సద్వినియోగం చేసుకుంటాను అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను తనను, బీజేపి పార్టీని దూషిస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే..  నిరభ్యంతరంగా అలాగే దూషించుకోవచ్చునని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కొంతమంది మీరు అలసిపోరా అని అడుగుతుంటారు. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే.. నిన్న ఉదయం నేను ఢిల్లీలో ఉన్నాను. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు వెళ్లి సాయంత్రానికి ఏపీకి వచ్చాను. ఇవాళ ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను అని చెబుతూ.. తనను దూషించే వారి విమర్శలే తనను ముందుకు నడిపించే బలాన్ని ఇస్తుంటాయని.. ఆ విమర్శలే ప్రజల జీవితాలను మెరుగుపర్చడం కోసం ఉపయోగించుకుంటుంటాను అని వ్యాఖ్యానించారు.

చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబపాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ.. దురదృష్టవశాత్తుగా ఎవరైతే తెలంగాణ పేరు ఉపయోగించుకుని అందలం ఎక్కారో.. వాళ్లే తెలంగాణలో అభివృద్ధి మందగించేలా చేశారని అన్నారు. తెలివైన తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని.. నిరుపేదలను ఇష్టం వచ్చినట్టు దోచుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

తప్పు చేసిన వాళ్లే ఎదురుదాడికి దిగుతున్నారు..
తెలంగాణ ప్రజలు ప్రతీ కుటుంబం సంక్షేమం కోసం పని చేసే బీజేపి పాలన కావాలని కోరుకుంటున్నారు కానీ తమ ఒక్కరి కుటుంబం కోసమే పనిచేసే ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదని కేసీఆర్ కుటుంబపాలనను వేలెత్తి చూపించారు. సొంత కుటుంబం బాగు కోసం కాకుండా ప్రజల మేలు కోరి పనిచేసే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొంతమంది తాము చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడికి పాల్పడుతున్నారని.. కానీ తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇటీవల  రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుకున్న ఆంతర్యం..
తెలంగాణలో అవినీతికి పాల్పడి నిరుపేదలను దోచుకుంటామనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీచేయడంతో పాటు.. తెలంగాణలో అవినీతికి పాల్పడిన వాళ్లే తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడికి దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకురాలి పేరు వినిపించడంతో పాటు తెలంగాణలో పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర అనినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో బీజేపిపై టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Trending News