తెలంగాణ యాదగిరిగుట్ట కేంద్రంగా ఓ బ్రోతల్ నడుపుతున్న కుటుంబ సభ్యులు కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టారు. పేద బాలికలను చేరదీస్తూ చదువు చెప్పిస్తామన్న నెపంతో వారి చేత వ్యభిచారం చేయించడానికి సంకల్పించారు. అయితే రాచకొండ పోలీసుల చాకచక్యంతో ఈ ముఠా గట్టు రట్టయింది. వివరాల్లోకి వెళితే కంసాని యాదగిరి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నాడు. బయట చూడడానికి సంసారుల ఇల్లులా కనిపించినా.. ఆ ఇంట్లో జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అభం శుభం ఎరుగని బాలికలను బ్రోకర్ల ద్వారా అక్కడికి తరలించడం అక్కడ నిత్యం జరిగే పని.
పదేళ్లు కూడా నిండని వయసులో అక్కడికి వచ్చే బాలికలకు హార్మోన్స్ ఎదుగుదల కోసం ఇంజక్షన్స్ ఇచ్చి.. ఆ తర్వాత వారిని వ్యభిచారంలోకి దింపడం అక్కడ రెగ్యులర్‌గా జరిగే పద్ధతి. తమ వద్దకు వచ్చి బాలికల పై చుట్టుప్రక్కల ఇండ్ల వారికి అనుమానం రాకుండా ఉండేందుకు కూడా ఈ ముఠా ఓ ప్రణాళిక రచించింది. తమ వద్దకు వచ్చే చిన్నారులను తొలుత స్థానిక పాఠశాలల్లో చేర్చి.. ఆ తర్వాత స్కూలు రికార్డ్స్‌లో వారు పేరు చేరాక.. అదే బాలికల పేరుతో ఆధార్ కార్డుకి దరఖాస్తు చేసేవారు. ఆ ఆధార్ కార్డు దరఖాస్తులో బ్రోతల్ యాజమానులే ఆ చిన్నారుల తల్లిదండ్రులుగా తమను పేర్కొంటూ వివరాలు ఇచ్చేవారు.
ఒక సారి ఆధార్ కార్డు వచ్చాక.. వీరి పని ఇంకా సులువయ్యేది. పోలీసులకు ఫిర్యాదు మేరకు అక్కడికి వచ్చి వాకబు చేసినా.. ఆ బాలికలు తమ పిల్లలే అని నమ్మబలికేవారు. ఈ ముఠాను స్వామి అనే ఓ డాక్టరు ముందుండి నడిపిస్తున్నట్లు కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆ డాక్టరే పిల్లలకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇవ్వడానికి వచ్చేవాడని కూడా దర్యాప్తులో తేలింది. ఈ మధ్యకాలంలో ఈ కుటుంబం మీద అనుమానాలు ఉన్నాయని తరచూ స్థానికుల నుండి ఫిర్యాదులు రావడంతో షీ టీమ్ సహకారంతో రాచకొండ పోలీసులు కొన్నాళ్లు రహస్యంగా ఈ కుటుంబం మీద నిఘా పెట్టారు.
వారి కదలికలను గమనిస్తూ.. వారి వివరాలు మొత్తం సేకరించారు. ఆ దర్యాప్తులో పిల్లల పేరిట దొంగ ఆధార్ కార్డులున్నాయని తెలిసింది. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠాని గతంలో కూడా పలు ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు తేలింది. తాజాగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ ముఠాని అరెస్టు చేసిన పోలీసులు.. వారిపై ఐపీసీ 366 ఏ, 371, 376, 372, 120 బి, 17, 133 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.