ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని అన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. ఆరోగ్యం ప్రతీ ఒక్కరి హక్కు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అంతా ఆరోగ్యంతో వుండాలనే లక్ష్యంతో ప్రతి వ్యక్తికీ ఆరోగ్యకార్డు అందించేందుకు హెల్త్ ప్రొఫైల్ను రూపొందించడం జరుగుతోంది అని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితిలో విద్య, వైద్యానికే జనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ రెండు అవసరాలు నిరుపేదలకు భారమైపోతున్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నిరుపేదల్ని అధికంగా పీడిస్తున్న ఈ రెండు సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెబుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య కార్డుల జారీ కోసం త్వరలోనే ఆరోగ్య సర్వే నిర్వహించనున్నట్టు వినోద్ కుమార్ స్పష్టంచేశారు.