వరంగల్: సామాజిక మాద్యమాలను(Social media) మంచికి ఉపయోగించుకుంటున్న వారు ఉన్న చోటే చెడుకు ఉపయోగించుకుంటున్న వారు కూడా ఉన్నారనే విషయాన్ని చాటిచెప్పుతూ తరచుగా పలు సైబర్ క్రైమ్ నేరాలు(Cyber crimes) వెలుగు చూస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో యువతులు పోస్ట్ చేసే ఫోటోలను కాపీ చేసుకుని వాటిని మార్ఫింగ్ చేస్తున్న కొంతమంది ఆకతాయిలు.. తర్వాత ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ లైంగిక వేధింపులకు(Sexual harassments) పాల్పతున్నారు. అలాంటి ఆకతాయి యువకుడినే బుధవారం వరంగల్ సైబర్ క్రైం పోలీసులు(Warangal cyber crime police) అరెస్టు చేశారు.
ఇంజనీరింగ్ చదువుతున్న ఆకతాయి యువకుడు ఇన్‌స్టాగ్రాం(Instagram)లోని యువతుల ఫోటోలను సేకరించి ఆ ఫోటోలను మరేదైనా ఆశ్లీలకరమైన ఫోటోతో మార్ఫింగ్ చేసి.. ఆ ఫోటో ద్వారా నకీలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తెరవడమే పనిగా పెట్టుకున్నాడు. అలా మార్ఫింగ్ చేసిన ఫోటోను సదరు ఫోటోలోని యువతికి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసి తనతో ఆశ్లీలకరంగా చాట్ చేయాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే అలా మార్ఫింగ్ చేసిన ఓ యువతి ఫోటోను.. బాధితురాలి కాలేజీకి సంబంధించిన గ్రూప్‌లోనూ పోస్ట్ చేశాడు. ఆకతాయి చేసిన పనికి అవమానభారం భరించలేని బాధితురాలి తల్లిదండ్రులు మట్టేవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వరంగల్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి ఆఖరికి నిందితుడిని పట్టుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన యువకుడు.. యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న అతికొద్ది సమయంలోనే నిందితుడుని గుర్తించి అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్ కమిషనరేట్ సైబర్ క్రైం విభాగం ఇన్‌స్పెక్టర్ జనార్థన్ రెడ్డి, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్ గణేష్‌తో పాటు సైబర్ క్రైమ్ సిబ్బంది ఏ.ఏ.ఓ ప్రశాంత్, కానిస్టేబుళ్ళు కిషోర్ కుమార్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ అభినందిచారు.