ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 అమలుపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు స్పందించింది. నాలుగేళ్లు గడిచిపోయినా విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. సమాధానం ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
The Supreme Court today sought Centre’s response after hearing a petition seeking implementation of Andhra Pradesh Reorganisation Act 2014. A division bench of the Supreme Court headed by Justice Arjan Kumar Sikri sought a reply in four weeks.
— ANI (@ANI) April 2, 2018
ఇదిలా ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమయ్యాయి రాజకీయ పార్టీలు. అధికార తెదేపా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చాక బీజేపీ, కేంద్రంపై తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఇందులో భాగంగా నేడో..రేపో చంద్రబాబు ఢిల్లీకి పయనమవుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అందుబాటులో ఉన్న జాతీయ నాయకులందరినీ కలవాలని నిర్ణయించారు. విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు.
ప్రతిపక్ష వైసీపీ కూడా ఏపీ హోదా కోసం పోరాటాలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీలంతా పార్లమెంట్ సమావేశాలు ముగిశాక పదవులకు రాజీనామా చేసి ఏపీ భవన్లో ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. లెఫ్ట్ పార్టీలు, ఇతర ప్రజాసంఘాలు, జేఏసీలు కూడా ఏపీ విభజన హామీల అమలు కోసం నిరసనలు, దీక్షలు చేపడుతున్నాయి.