న్యూ ఢిల్లీ: అలోపతిక్ మెడిసిన్‌పై యోగా గురు రాందేవ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ బ్రాంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాకుండా రాందేవ్‌పై రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ (IMA Uttarakhand slaps defamation notice on Ramdev) నోటీసులు కూడా పంపించింది. రాందేవ్ మరో 15 రోజుల్లోగా తాను చేసిన వ్యాఖ్యలను ఉహసంహరించుకుంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయకపోయినా.. లేదా తాను చేసిన వ్యాఖ్యలకు తనని క్షమించాల్సిందిగా కోరుతూ రాతపూర్వకంగా క్షమాపణలు కోరకపోయినా అతడి నుంచి పరువు నష్టం కింద రూ. 1000 కోట్లు డిమాండ్ చేయాల్సి ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ యూనిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది.
రాందేవ్‌పై పరువు నష్టం దావా వేయడంతోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ విభాగానికి అతడిపై ఆగ్రహం చల్లారలేదు. అలోపతిక్ చికిత్సా విధానాన్నే కించపర్చేలా వ్యవహరించిన రాందేవ్‌పై తక్షణమే కేసు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్‌కి ఐఎంఏ ఉత్తరాంచల్ విభాగం ఓ లేఖ రాసింది.
అలోపతిక్ మెడిసిన్స్‌ని స్టుపిడ్ సైన్స్‌గా అభివర్ణించిన రాందేవ్ బాబా.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతించిన రెమ్‌డిసివిర్, ఫెవిఫ్లూతో పాటు (remdesivir, faviflu) ఇతర అలోపతిక్ మెడిసిన్స్ ఏవీ కరోనా రోగుల ప్రాణాలు కాపాడలేకపోయాయని వ్యాఖ్యానిస్తూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
అలోపతిక్ మెడిసిన్‌లో (allopathic medicine) దమ్ము లేదని యోగా గురు రాందేవ్ చేసిన వ్యాఖ్యలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో పాటు ఎయిమ్స్‌కి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్, సప్ఫదర్ జంగ్ హాస్పిటల్స్‌కి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్‌తోపాటు దేశవ్యాప్తంగా పలు ఇతర డాక్టర్ల అసోసియేషన్స్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్ (Union Health Minister Harsh Vardhan) సైతం రాందేవ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ అతనికి ఓ లేఖ రాశారు. రాందేవ్ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అని అభిప్రాయపడిన కేంద్ర మంత్రి... దేశవ్యాప్తంగా కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు అహర్నిషలు కృషి చేస్తోన్న వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాందేవ్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. రాందేవ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించారు. ''మీ వ్యాఖ్యలతో కేవలం అలోపతిక్ డాక్టర్లనే కాదు.. దేశంలో ఆ చికిత్స విధానాన్నే విశ్వసిస్తున్న కోట్ల మంది ప్రజల మనోభావాలను కూడా కించపర్చారు'' అని రాందేవ్‌కి (Ramdev) రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.