ఇండియన్ రైల్వేస్ సరికొత్త ప్రయోగం: రైల్వే సేవల నాణ్యతపై అండర్‌కవర్ ఆపరేషన్

Last Updated : Jun 15, 2018, 12:25 PM IST
ఇండియన్ రైల్వేస్ సరికొత్త ప్రయోగం: రైల్వే సేవల నాణ్యతపై అండర్‌కవర్ ఆపరేషన్

రైల్వే సేవల్లో అధికార యంత్రాగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా నాణ్యమైన ఆహారం, మౌళిక సదుపాయలను అందించడంలో ఇండియన్ రైల్వేస్ విఫలం అవుతోందని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో తమ ప్రయాణీకులకు అందించే సేవలపై నిఘా నేత్రం ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే సివిల్‌ డ్రెస్‌లో మఫ్టీలో ఉండే అధికారుల నియామకానికి రైల్వే శాఖ రంగం సిద్ధం చేసుకుంటోంది. రైళ్లలో ప్రయాణీకుల పట్ల సిబ్బంది ప్రవర్తన, టికెట్ బుకింగ్ విధానంలో ప్రయాణికులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, ఐఆర్‌సీటీసీ అందిస్తోన్న ఆహార పదార్థాల నాణ్యత, ప్రయాణికులకు అందుతున్న మౌళిక సదుపాయాలపై సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే వ్యవహరిస్తూ పర్యవేక్షించడం వారి విధుల్లో ఓ భాగం అని సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి. సగటు ప్రయాణీకుల తరహాలోనే మఫ్టీలో ఉన్న ఈ అధికారులు సైతం రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఆహార పదార్థాలను కొనుగోలు చేసి వాటి నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, సౌకర్యాలపై ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు. 

తాము చేపట్టనున్న ఈ సరికొత్త ప్రయోగం ద్వారా రైల్వే సిబ్బందిలో తమ విధులు, సేవల పట్ల కొంత భయం ఏర్పడుతుందని రైల్వే శాఖ ఆశిస్తోంది. అయితే, ఈ రకమైన పర్యవేక్షణ సేవల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవాలా లేక కొంతమేరకు స్వచ్ఛంద సేవా సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలా అనే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి.

Trending News