న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కలకలం రేపిన 11 మంది సామూహిక ఆత్మహత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీని చేధించారు ఢిల్లీ పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన ఆ 11 మంది మృతులకు.. మృతుల్లో ఒకరైన లలిత్ భాటియా(42) భ్రమలే ప్రధాన కారణం అని సమాచారం. ఈ మేరకు భాటియా ఇంట్లో దొరికిన ఓ డైరీ ద్వారా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
మూఢనమ్మకాలపై అతి విశ్వాసం గల లలిత్.. 5 సంవత్సరాల నుంచి మౌనవ్రతంలో ఉన్నాడు. పది సంవత్సరాల క్రితం చనిపోయిన ఇతడి తండ్రి తాజాగా కన్పిస్తూ, తనతో మాట్లాడుతున్నాడని కుటుంబీకులకు చెప్పాడు. తండ్రి వద్దకు వెళ్లాలని, మోక్షం పొందాలని ఇతడు ఆత్మహత్యకు సిద్దపడి ఇతరులనూ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని ఇతడి చేతిరాతతో పోలిన డైరీతో పోలీసులు గుర్తించారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరాణా కొట్టు నడుపుతున్న లలిత్ ఐదేళ్ళుగా మౌనవ్రతం పాటిస్తూ పాటిస్తూ.. గత కొంతకాలం నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. తండ్రి నుంచి తనకు ఆదేశాలు వస్తున్నాయని, ఇంట్లో అందరూ వాటిని పాటించాలని లలిత్ చెప్పినట్లు అందులో డైరీలో ఉంది.
అందులో ఒకచోట ‘మమ్మల్ని దేవుడు కాపాడుతాడు’ అని రాసి ఉన్నట్లు.. ఆత్మహత్యలు చేసుకోడానికి ముందు రిహార్సల్స్ కూడా చేసినట్లు ఆ డైరీ ద్వారా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. భాటియా చెప్పిన విషయాలను కుటుంబ సభ్యులు నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు .
11 మందిలో ఇప్పటి వరకు ఆరుగురి పోస్ట్‌మార్టం నివేదికలు రాగా.. వారందరూ ఉరితీత వల్ల మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. వారి శరీరాలపై ఎటువంటి గాయాల లేవని, మృతుల కళ్ళను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు కోరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
మరోవైపు ఆ 11 మందిది ఆత్మహత్య కాదని భాటియా బంధువులు ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.