మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో రెండు వేర్వేరు మతాలకు చెందిన వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం హింసాత్మ పరిణామాలకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఆందోళనకారులు సుమారు 100కుపైగా దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ అల్లర్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అబ్జుల్ ఖాద్రి అనే పౌరుడు ఒకరు చనిపోగా, తగలబడిన దుకాణంలో వుండటంతో జగన్‌లాల్ బన్సిలె అనే మరో వ్యక్తి కాలిన గాయాలపాలై చనిపోయారు. ఔరంగబాద్‌లో పరిస్థితి చేయిదాటిపోవడంతో అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు సెక్షన్ 144 కింద కర్ఫ్యూ విధించారు. ఓ ప్రార్థనా మందిరానికి అక్రమంగా నీటి సరఫరా చేస్తున్న నీటి కనెక్షన్ తొలగించడంతో నీటి సరఫరా విషయమై శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఈ అల్లర్లకు దారితీసింది. ఔరంగబాద్‌లో అనేక ప్రాంతాల్లో యువకులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైమరొకరు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు.
ఇదిలావుంటే, అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టామని, దీని వెనుకున్న స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదని నగర పోలీసు కమిషనర్ తెలిపారు. యువత సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతుండటంతో నగరంలో మరిన్ని వదంతులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఈ అల్లర్లలో 10 మంది పోలీసులు గాయపడ్డారు.