COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి

COVID19 For Diabetes Patient | కొత్త వేరియంట్లు సైతం పుట్టుకురావడంతో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే మధుమేహం (Diabetes) పేషెంట్లలో కరోనా వ్యాధి మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 17, 2021, 12:34 PM IST
COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి

కరోనా బారిన పడిన వారిలో శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. SARS-CoV-2 వైరస్ గత ఏడాది నుంచి ఇప్పటివరకూ ఎన్నోసార్లు పరివర్తనం చెంది రూపాంతరం చెందింది. కొత్త వేరియంట్లు సైతం పుట్టుకురావడంతో కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే మధుమేహం (Diabetes) పేషెంట్లలో కరోనా వ్యాధి మరింత ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక షుగర్ పేషెంట్లు కచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. 

మధుమేహం ఉన్నవారిలో కరోనా ప్రభావం తొలి రోజుల్లో అంతగా తెలియదని, రోజులు గడిచేకొద్దీ కోవిడ్19 మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్నారు. డయాబెటిస్ మరియు స్థూలకాయం సమస్యలు ఉన్నవారు కరోనా బారిన పడకుండా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా అనారోగ్య సమస్యలు ఉన్నవారితో పోల్చితే మధుమేహం, ఊబకాయంతో బాధ పడుతున్న వారికి కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కరోనా(Covid-19) బారినుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ సమస్యను గుర్తించారు. మధుమేహం సమస్య ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ సోకితే మాత్రం వారి ప్రాణాలు కాపాడటం మరింత కష్టతరం అవుతుంది.

కరోనా సమయంలో షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:
1) ఇంట్లోనే ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్లకూడదు. ఇంట్లో కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేయాలి. నడవటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కొన్ని రకాల యోగాసనాలు వేయడం, ధ్యానం చేయడం ద్వారా షుగర్ కాస్త అదుపులో ఉంటుంది.

2) డాక్టర్ సూచించిన విధంగా మీరు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి.

3) పోషకాలు లభించే ఆహారం తీసుకోండి. కరోనా వైరస్ (CoronaVirus) సోకిన వారు, కరోనాను జయించినా డీహైడ్రేడ్ అవకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారానికి బదులుగా, స్వల్ప విరామాలలో కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకోండి. తియ్యగా ఉండే పదార్ధాలు, స్వీట్లు మరియు నూనెలో బాగా వేయించిన ఆహారాలు తినకూడదు.

4) తాజా ఆకుకూరలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

5) పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీ చేతులను తరచుగా శుభ్రపరచుకోవాలి. ఇతరులతో భౌతికదూరాన్ని పాటించాలి మరియు ఇంటి నుంచి బయటకు వెళ్లిన్పుడు ముఖానికి ఫేస్ మాస్క్ (Face Mask) ధరించండి.

6) మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి. ఏ విషయంలోనూ నిరుత్సాహ పడకూడదు. అధైర్యానికి లోను కావొద్దు. ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ఉండాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News