TDP vs YSRCP: టీడీపీ విజయానికి తెలుగు తమ్ముళ్లే అడ్డమా ? శ్రీకాళహస్తి రాజకీయాలే అందుకు నిదర్శనమా ?

AP Assembly Elections 2023: ఏపీలో తెలుగు దేశం పార్టీ విజయానికి తెలుగు తమ్ముళ్లే అడ్డం పడుతున్నారా ? పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన వాళ్లే.. పార్టీని దెబ్బ తీస్తున్నారా ? అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటి ? టీడీపీని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటి ? 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2023, 04:40 AM IST
TDP vs YSRCP: టీడీపీ విజయానికి తెలుగు తమ్ముళ్లే అడ్డమా ? శ్రీకాళహస్తి రాజకీయాలే అందుకు నిదర్శనమా ?

AP Assembly Elections 2023: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు సమీపించినా.. ఆ సమయంలో రాష్ట్రంలో జరిగే అనేక రాజకీయ పరిణామాలు, సమీకరణలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వి నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకొని భారీ జన సమీకరణతో చంద్రబాబు నాయుడు సమక్షంలో కండువా కప్పుకోవాలని ప్రయత్నించాడు. కానీ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి  బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన రాకకు అడ్డుకట్ట వేశారు. ఎస్సివి నాయుడు రాకను నిరాకరించిన సుధీర్ రెడ్డి.. నాయుడు పార్టీలోకి వస్తే ఆయనతో పాటు తెలుగుదేశం శ్రేణులు ఎవరు వెళ్ళరాదు అని టీడీపీ కార్యకర్తలకు, స్థానిక నేతలకు హుకుం జారీచేశాడు. ఆ ఆడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పుడైతే ఆడియో సోషల్ మీడియాలో వచ్చిందో అప్పుడే ఒక్కసారిగా శ్రీకాళహస్తిలో రాజకీయం సెగలు పుట్టించింది. 

ఎస్సీవీ నాయుడు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో 2004లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఆ సమయంలో సీనియర్ నాయకుడైన బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఎస్ సి వి నాయుడు పార్టీ మారాలని నిర్ణయించుకొని 2004లో ఎంపీ చింతామోహన్ సహాయంతో ఢిల్లీలోని సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎస్సీ వి నాయుడు రాకను నిరాకరించారు. కానీ మాజీ ఎంపీ చింతా మోహన్ పట్టుబట్టి కాంగ్రెస్లో టికెట్ ఇప్పించి  ఎస్ సి వి నాయుడును ఎమ్మెల్యేను చేయగలిగారు. ఆ తర్వాత ఆయన 20009లో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ తరపున  గోపాల కృష్ణారెడ్డి గెలుపుపొందాడు. ఆ తర్వాత ఆయన పార్టీలో  ఉండలేకపోయారు. 2019లో ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకి పనిచేయాలని పార్టీ అధికారం చేబడితే ఎమ్మెల్సీ ఇస్తామని వైసీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో ఆయన బియ్యపు మధుసూదన్ రెడ్డికి పనిచేశారు. బి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. వైసిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కానీ ఎస్సీ వి నాయుడుకు ఇచ్చిన హామీ నెరవేరలేదని గత రెండేళ్లుగా అసంతృప్తితో ఉన్నాడు.

ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో సఖ్యత లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. ఆయన అమరావతికి వచ్చి పార్టీలో చేరాలని తెలిపినట్లు సమాచారం ఇచ్చారు. ఎస్.వి నాయుడు జూన్ 8వ తారీఖున విజయవాడలో భారీ జన సమీకరణ మధ్య తన అనుచరులతో పార్టీ కండువా కప్పుకోవాలని ఎస్సీవీ ప్రయత్నాలు చేశాడు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి  బొజ్జల సుధీర్ రెడ్డి.. తన పార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూపులో కొన్ని మీడియా గ్రూపులో ఆడియో లీక్ చేశారు. ఆడియోలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఇన్చార్జిగా ఉన్న నాతో సంప్రదించకుండానే పార్టీలోకి రావడం కుదరదని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరు కూడా ఆయనతో వెళ్ళరాదని ఒకవేళ వెళితే వారిపై చర్యలు తీసుకుంటానని హెత్తరించారు. 

సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవడంతో ఎస్సీబీ నాయుడు చేరికపై బ్రేకులు పడ్డాయి. ఈనెల 12వ తేదీన పార్టీ కార్యాలయంలో సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎస్ సి బి నాయుడు పార్టీలోకి రావడం మంచిదే కానీ వర్గాలు ఏర్పాటు చేస్తే ఒప్పుకోమని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక వర్గం అది బొజ్జల వర్గం మాత్రమేనని అన్నారు. మేము పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని తెలుగుదేశం పార్టీలోనే సస్తామని కూడా అన్నారు. ఒకవేళ ఎవరైనా మా ఆదేశాలను దిక్కరిస్తే పార్టీ నుండి బయట పంపించేస్తామని అన్నారు. దాంతో ఒక్కసారిగా ఎస్ వి నాయుడు అంతర్మదనంలో పడిపోయాడు. 

చంద్రబాబు నాయుడు ఈనెల 14న కుప్పం పర్యటన సందర్భంగా అక్కడికి వచ్చి కలవాలని చెప్పినట్లు అక్కడే పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చెప్పినట్లు నాయుడు అనుచరులు చెబుతున్నారు. అయితే ఎస్సీ వి నాయుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న వారంతా వైసీపీ  వైపు వెళ్లిపోతామని కార్యకర్తలు అంటున్నారని సుధీర్ రెడ్డి అంటున్నాడు. ఎస్సీ వి నాయుడు కుప్పంలో చంద్రబాబు నాయుడుతో కలుస్తారా లేదా అనేది సమాచారం పూర్తిగా తెలియడం లేదు. 

ఎస్సీబీ నాయుడు వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు మాత్రం మీరు టిడిపిలోకి వెళ్లడం మంచిది కాదని ఇలా పార్టీలు మారుతుంటే అవకాశాలు పోతాయి ఇంతకాలం పార్టీలో ఉన్నారు ఇంకో ఏడాది ఉంటే అవకాశం కల్పిస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళితే మరో ఐదేళ్లు అక్కడ కష్టపడాలని ఆ తర్వాత ఇస్తారో లేదో కూడా తెలీదని అంటున్నారు. ఈ పరిణామాలు అన్నింటిని చూస్తుంటే వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని ఎందుకంటే నాయకులు లేకపోయినా ప్రజలు ఉన్నారని ప్రజా బలం నిత్య ప్రజల్లో కష్టపడుతున్నారని అతనికి ఏ నాయకుడు ఎదురు లేకుండా ఉన్నారని.. తిరిగి ఎమ్మెల్యే అవకాశం అతనికి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల వర్సెస్ ఎస్ సి వి నాయుడు అంతర్గత పోరు ఇప్పటిలో ఆగుతుందా అనేది ఎస్ సి వి నాయుడు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది.

Trending News