CM Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడటం లేదు..! రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఓ క్లారిటీ రావడం లేదు. మొన్నటివరకు ఆషాడం అన్న నేతలు.. ఆ తర్వాత విస్తరణను శ్రావణమాసంకు మార్చేశారు. తదనంతరం మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగియడంతో రేపోమాపో విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణకు అనేక అడ్డంకులు ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు నల్గొండ నేతలే అడ్డంకిగా మారారని జోరుగా ప్రచారం జరుగుతోంది..
ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో మొత్తం 12 మంత్రులు ఉన్నారు. ఇందులో అన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా నేతలకు పదవులు దక్కాయి. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలకే పదవులు వరించాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా సీనియర్ నేతలు కావడంతో మంత్రి పదవులు దక్కాయి. దాంతో మరో సామాజికవర్గానికి పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైందని పార్టీ నేతలు అంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో సర్కార్ ఏర్పడగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయాన్ని రాజ్‌గోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతోందని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై లోతైన చర్చ జరిగిందట. ఇప్పటివరకు కొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో ముందు ఆ జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారట. ప్రస్తుతం హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారట. దాంతో నిజామాబాద్ జిల్లా నుంచి మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక సోదరుల్లో ఎవరో ఒకరికి చాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. అటు రంగారెడ్డి జిల్లా కోటాలో మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఒకరిని ఎంపిక చెద్దామని అనుకున్నారట. కానీ నల్గొండ విషయానికి వచ్చే సరికి అసలు సమస్య మొదలైందట. నల్గొండలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఉన్నారు. దాంతో బీసీ, లేదా ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారట. కానీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డ మాత్రం మంత్రి పదవి తనకే ఇవ్వాలని బెట్టు చేస్తున్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తనను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు గత పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభను సీటులో తాను కష్టపడినంతా మరెవరు కష్టపడలేదని అన్నారట. తాను కష్టపడినందుకే నల్గొండలో రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిందని చెబుతున్నారట. అందుకే తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా రాజ్ గోపాల్ రెడ్డి మెలికతో మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్టు గాంధీభవన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగి అసంతృప్తులు పెరిగిపోతే ఎన్నికల్లో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. అందుకే కొద్దిరోజులు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయడమే బెటరనీ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది..
Also Read: Pawan Kalyan: కేంద్రమంత్రిగా పవన్?.. ప్లాన్ మార్చిన మోడీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.