మీ డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఏటీఎం లేదా బ్యాంకులకే వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్లి మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం ఈ విధానాన్ని తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తెస్తోంది.
సోమవారం (జులై 30) నుంచి రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో మనీ విత్డ్రా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు శనివారం మీ సేవ రాష్ట్ర కమిషనర్ జీటీ వెంకటేశ్వర్రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం నుండి 60 మీ సేవ కేంద్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నారు. నెల తర్వాత రాష్ట్రంలోని మిగతా మీసేవ కేంద్రాల్లో ఈ విధానాన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతానికి రోజుకు గరిష్టంగా 2 వేలు విత్డ్రా చేసుకొనే అవకాశముండగా.. 2,3 నెలల్లో 10 వేలకు పెంచనున్నారు. ఆధార్ బేస్డ్ పెమెంట్ సిస్టమ్ ద్వారా విత్డ్రా సౌకర్యం కల్పిస్తున్నారు. నగదు తీసుకునేటప్పుడు కస్టమర్ల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమన్నారు.