హైదరాబాద్‌లో 43 మంది మందుబాబులకు జైలుశిక్ష.. వారు చేసిన నేరమేమిటంటే..?

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాగి డ్రైవింగ్ చేస్తున్న వారి పట్ల విసిరి వేసారిపోయారు. 

Last Updated : Oct 30, 2018, 09:25 PM IST
హైదరాబాద్‌లో 43 మంది మందుబాబులకు జైలుశిక్ష.. వారు చేసిన నేరమేమిటంటే..?

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాగి డ్రైవింగ్ చేస్తున్న వారి పట్ల విసిరి వేసారిపోయారు. అందుకే ఇక జరిమానాలతో పనులు సక్రమంగా జరగవని భావించి.. ఈ మధ్యకాలంలో దొరికిన ప్రతీ కేసును కోర్టును పంపిస్తున్నారు. దాంతో కూకట్‌పల్లిలోని 9వ మెట్రోపాలిటన్‌ మేజిస్ర్టేట్‌ కోర్టుకి లెక్కలేని కేసులు వస్తున్నాయి. అలా నమోదైన కేసులను విచారించిన న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేకపోతే ఏమీ చేయలేమని.. ఒకసారి శిక్ష అనుభవిస్తే తెలిసొస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 43 మంది మందుబాబులకు జైలుశిక్ష విధించారు.

నిబంధనల ప్రకారమే ఈ శిక్ష విధించామని.. చేసిన నేరం స్థాయిని బట్టి ఈ శిక్ష 3 రోజుల నుండి 23 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారికి కూడా శిక్ష విధించారు. అలా పట్టుబడిన 44 మందికి 4 రోజుల పాటు కారాగార శిక్ష విధించారు. అలాగే సెల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలు నడిపిన ఇద్దరికి నాలుగు రోజుల పాటు జైలుశిక్ష విధించారు. 

ఈ మధ్యకాలంలో రాజధానిలో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. తాగి వాహనాలు నడపడంతో పాటు.. ప్రశ్నిస్తే ఎదురుతిరుగుతున్నారని తెలిపారు. పలుమార్లు తాగి వాహనం నడిపేవారు పోలీసులపై కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పలువురు సెలబ్రిటీలైతే తాగి వాహనం నడపడమే కాకుండా.. పోలీసులకు ఎదురుతిరిగి మాట్లాడడం.. బెదిరించడం కూడా చేస్తున్నారు. జరిమానాలు కట్టడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో పోలీసులకు కేసులు నమోదు చేసి.. వారిని కోర్టుకి పంపించడం తప్పడం లేదు.

Trending News