కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఓ బంపర్ ఆఫర్ ఊరిస్తున్నది. ఒక ప్రణాళిక ప్రకారం వెళితే అది సాధ్యమే. కనీస వేతనం, ఫిట్మెంట్ డిమాండ్లను అంగీకరించడానికి సిద్ధంగా లేని కేంద్ర ప్రభుత్వం.. నిరాశతో ఉన్న ఉద్యోగులకు త్వరలోనే ఒక శుభవార్తను అందించనుంది.
ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కింద విదేశాలకు కూడా వెళ్లే అవకాశం కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తును మొదలుపెట్టిన సంబంధిత మంత్రిత్వ శాఖ.. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఎల్టీసీలో భాగంగా ఉద్యోగులు వెళ్లేందుకు ఐదు ఆసియా దేశాల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో కజక్‌స్థాన్, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ దేశాలు ఉన్నాయి.
కేంద్ర విదేశాంగ శాఖ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. మధ్య ఆసియా దేశాలతో పరస్పర సహాయ సహకారాలు పెంచుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాల్సిందిగా హోం, టూరిజం, పౌర విమానయాన శాఖలకు లేఖలు పంపించింది.
వాస్తవానికి, ఈ ఏడాది మార్చిలోనే ఎల్టీసీ కింద విదేశీ పర్యటనలు ఉంటాయని.. పర్యటనలో భాగంగా సార్క్ దేశాలను చుట్టిరావొచ్చని అందుకు ఓ ప్రణాళిక తయారుచేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. సార్క్(SAARC) సభ్య దేశాలు ఎనిమిది: ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, భారతదేశం, పాకిస్థాన్, మాల్దీవులు, శ్రీలంక.
ఎల్టీసీ కింద అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతోపాటు టికెట్ రీయింబర్స్మెంట్ ఇస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48.41 లక్షల మంది కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కేంద్రం ఊరిస్తున్న ఈ ప్రతిపాదన కంటే.. తమ డిమాండ్లే ముఖ్యమని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. కాగా కేంద్రం త్వరలోనే పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.