తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమలేశుని ఆభరణాల కోసమే అధికారులు పోటు ప్రాంతంలో తవ్వకాలు చేశారని.. లేకపోతే ఆ అవసరం ఏముందని ఆయన ఆరోపించారు. అలాగే శ్రీవారి ఆభరణాలను స్విట్జర్లాండ్‌లో వేలం వేశారని.. తగురీతిలో ఎంక్వయరీ వేస్తే వివరాలన్నీ బయటకు వస్తాయని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి ఇళ్ళల్లో కూడా సోదాలు చేయాలని.. ఆయన ఇంట్లో కూడా శ్రీవారి నగలున్నట్లు తనను అనుమానముందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఒకవేళ వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే చట్టప్రకారం తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌తో పాటు, అమరావతిలోని చంద్రబాబు నాయుడి నివాసాల్లో తెలంగాణ ప్రభుత్వం సోదాలు నిర్వహిస్తే.. తిరుపతి బాలాజీ ఆభరణాలు లభిస్తాయని.. అలా లభించకపోతే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే చంద్రబాబు నాయుడు చేసిన "ధర్మపోరాటదీక్ష"పై కూడా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. ప్రజల డబ్బు కాబట్టే.. టీడీపీ యధేచ్చగా ఖర్చుపెడుతుందని ఆయన ఆరోపించారు.