టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు చేసిన క్రమంలో ఆయన పై కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనకు పలు వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. ఈ విషయంపై ప్రశ్నించిన తనను ఆయన హింసిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆ ఆరోపణలకు ఊతమిస్తూ.. ఆమె షమితో సన్నిహితంగా ఉన్న పలు మహిళల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలను తాను షమీ ఫోన్ నుండి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జహాన్ పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ఆయన తనను చంపడానికి ప్రయత్నించారని.. చాలా టార్చర్ పెట్టారని ఆమె తెలిపారు. షమీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ కేసు నిమిత్తం తదుపరి విచారణను చేపట్టనున్నట్లు తెలిపారు.
హసీన్ జహాన్ షమిని పెళ్లి చేసుకోకముందే మరో వ్యక్తిని వివాహం చేసుకొని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె షమిపై ఆరోపణలు చేస్తూ.. ఓ పాకిస్తాన్ యువతితో ఆయనకు రిలేషన్‌షిప్ ఉందని తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం తనకు విడాకులు ఇవ్వాలని బలవంతం చేశారని జహాన్ చెప్పారు.
తనతో పెళ్లికి ముందు నుంచే ఆమెతో షమికి సంబంధాలు ఉన్నాయని.. ఆయన ఆ విషయం తనకు ముందుగా చెప్పలేదని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకోవాలని షమి భావిస్తున్నాడని.. అందుకే తనకు విడాకులు ఇవ్వాలని కోరుతున్నాడని జహాన్ తెలిపారు. ఐపీఎల్ తరఫున కోల్‌కతా నైట్‌రైడర్స్ పాల్గొనే మ్యాచ్‌లప్పుడు జహాన్ చీర్ లీడర్‌గా పనిచేయడం గమనార్హం..!
టీమిండియా ఆటగాడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు