ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలతో జరిగే ప్రత్యేక భేటీలో చంద్రబాబు పాల్గొంటారని.. వారితో పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న పలు అభ్యంతరాల విషయంపై చర్చిస్తారని వినికిడి. ఇప్పటికే ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ఆపేయమని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
గతంలో నితిన్ గడ్కరి స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టని.. దానిని పూర్తి చేయడానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో పలు అభ్యంతరాలు ఉండడంతో.. పూర్తిస్థాయి సమగ్ర నివేదిక కావాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వానికి తెలిపింది.
ఈ క్రమంలో ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఎలా నచ్చచెబుతారో.. వారి నుండి ఎలాంటి సమాధానాన్ని పొందుతారో వేచి చూడాల్సిందే.ఈ భేటీలో పాల్గొని కేంద్ర మంత్రులతో మాట్లాడాక.. చంద్రబాబు తన దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నారు.