ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త. కేంద్రం దేశంలోని లక్షలాది మంది ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలను పెంచింది. ఈ మేరకు వారి గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. దీపావళి కానుకగా నవంబరులో పెంచిన గౌరవ వేతనాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సేవలను కొనియాడుతూ.. వారికి వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించారు. పోషన్ మిషన్లో.. పౌష్టికాహరలోపం లేకుండా చిన్నారులు, గర్బిణీలను కాపాడడంలో ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల పాత్రను అభినందించారు. ఆశా వర్కర్లకు ప్రోత్సహాకాలను రెండింతలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆశా వర్కర్లు, హెల్పర్లకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ఈనెల 23న ఝార్ఖండ్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
అంగన్వాడీలకు రూ.3000 నుంచి 4500కు గౌరవ వేతనం పెంచుతున్నామని ప్రకటించారు. అలాగే 2200 గౌరవవేతనం పొందుతున్న వారికి 3500, అంగన్వాడీ హెల్పర్లకు 1500 నుంచి 2259కు పెంచుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీలకు ప్రోత్సహాకాలను 250 నుంచి 500 వరకు ఇస్తామని తెలిపారు.
కోటి అంగన్వాడీ లబ్ధిదారుల తొలగింపు
కోటి మంది నకిలీ అంగన్వాడీ లబ్ధిదారుల్ని గుర్తించి వారిని తొలగించినట్లు మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ ఓ ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారుల తొలగింపు అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది అంగన్వాడీ లబ్ధిదారులున్నారని.. అస్సాంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ సర్వే ద్వారా 14 లక్షల మంది నకిలీ అంగన్వాడీల్ని (చిన్నపిల్లలు) గుర్తించామన్నారు. దేశంలో మొత్తం 1283707మంది కార్యకర్తలు, 1050564 మంది హెల్పర్లు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.