న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నేడు జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ లో మండల్గఢ్ అసెంబ్లీ స్థానం, అజ్మీర్, అళ్వార్ లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ముఖ్యమంత్రి వసుంధరా రాజే నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని చెప్పారు.
ట్విట్టర్ లో రాహుల్ స్పందిస్తూ..'శభాష్.. రాజస్థాన్ కాంగ్రెస్! ఈ విజయం అందరిదీ. అందరికిది గర్వకారణం. రాజస్థాన్ ప్రజలు బీజేపీకి ఇచ్చిన తీర్పు ఇది' అని పేర్కొన్నారు.
Well done Rajasthan Congress! Proud of each and every one of you. This is a rejection of the BJP by the people of Rajasthan.#RajasthanByPolls
— Office of RG (@OfficeOfRG) February 1, 2018
కాంగ్రెస్ మండల్గఢ్ అసెంబ్లీ స్థానంలో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ధకాడ్, బిజేపీ అభ్యర్థిపై 12,976 ఓట్లతో గెలిచారు. అలానే ఆళ్వార్ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ బీజేపీ అభ్యర్థి జశ్వంత్ యాదవ్ పై లక్షన్నర ఓట్లతో విజయం సాధించారు. అజ్మీర్ లో గెలుపొందేందుకు బీజేపీ తీవ్రస్థాయిలో ప్రయత్నించినా.. కాంగ్రెస్ అభ్యర్థే గెలిచాడు.
కాగా, ఈ మూడు స్థానాల్లో పోలింగ్ జనవరి 29న జరిగింది. అజ్మీర్ ఎంపీ సంనర్ లాల్ జాట్, ఆళ్వార్ ఎంపీ చంద్ నాథ్, మండల్గఢ్ ఎమ్మెల్యే కీర్తి కుమారి మరణాల తర్వాత మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ముగ్గురు నాయకులు భారతీయ జనతా పార్టీ (బీజీపీ)కి చెందినవారు.