యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Last Updated : Oct 17, 2019, 01:50 AM IST
యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

లక్నో: పెరిగిన హోంగార్డుల జీతాలకు అనుగుణంగా అంత మంది సిబ్బందికి జీతాలు చెల్లించడం ఆర్థికంగా భారం అవుతుందనే కారణాన్ని చూపిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 25,000 మంది హోంగార్డులను పక్కకు పెడుతోన్న సంగతి తెలిసిందే. అయితే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అక్కడి అధికారవర్గాలను కుదేలు చేస్తోంటే.. తాజాగా అక్కడి ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారుల సెలవులను వచ్చే నెల 30 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించి వారికి మరో షాక్ ఇచ్చింది. అన్ని శాఖల అధికారులు తమ జిల్లాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళరాదని ఆదేశించింది. ఎంతో అత్యవసరమైతేనే సెలవు మంజూరు చేయడం జరుగుతుందని సర్కార్ స్పష్టంచేసింది. రానున్నది పండుగల కాలం కావడం వల్లే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిథి ఒకరు తెలిపారు.
 
ఇదిలావుంటే, ఇలా ప్రభుత్వం ఉన్నట్టుండి ఇన్ని రోజులపాటు సెలవులను రద్దు చేయడానికి కారణం అయోధ్య రామ జన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉన్నందువల్లేనని తెలుస్తోంది. అయోధ్య రామ జన్మ భూమి వివాదంపై రోజువారీ విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ముగించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 40 రోజులపాటు వాదనలను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో ఆలోగానే ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశాలున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ముందస్తు జాగ్రత్త చర్యగా యూపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చుననేది వారి అభిప్రాయం.

Trending News