స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత.. కాలుష్య నివారణ బోర్డుకి తమిళ ప్రభుత్వం ఆదేశాలు జారీ

తమిళనాడులో గత వారం రోజులుగా అనేక ఆందోళనలకు కారణభూతమైన స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని సీజ్ చేయమని ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం కాలుష్య నివారణ బోర్డుని ఆదేశించింది.

Last Updated : May 28, 2018, 10:33 PM IST
స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత.. కాలుష్య నివారణ బోర్డుకి తమిళ ప్రభుత్వం ఆదేశాలు జారీ

తమిళనాడులో గత వారం రోజులుగా అనేక ఆందోళనలకు కారణభూతమైన స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని సీజ్ చేయమని ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం కాలుష్య నివారణ బోర్డుని ఆదేశించింది. స్టెరిలైట్ కర్మాగారం వల్ల స్థానిక ప్రజలు ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారని ఆ సంస్థను బహిష్కరించాలని కోరుతూ ఆందోళనకారులు చేసిన ధర్నాలో హింస చెలరేగడంతో 13 మంది మరణించారు.

పోలీసులు ఫైరింగ్ చేయడమే అందుకు కారణమని ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఎంకే స్టాలిన్, కమల్ హాసన్ లాంటి నేతలు బహిరంగంగానే ఈ ఘటనను ఖండించారు. ఈ హింసకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూ డీఎంకే రాష్ట్ర వ్యాప్త బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా దిగొచ్చింది. ఆ కర్మాగారాన్ని శాశ్వతంగా సీజ్ చేయాలని కాలుష్య నివారణ బోర్డును ఆదేశించింది. 

ఈ మధ్యకాలంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో వేదాంత గ్రూపుకి చెందిన స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం అభిప్రాయపడింది. అయితే ఈ సమావేశం జరగక ముందే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రి జయకుమార్ తూత్తుకుడి ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వారిని అన్నివిధాలుగానూ ఆదుకుంటామని తెలిపారు.

వారికి నష్టపరిహారం కూడా ప్రకటించారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ గత రెండు సంవత్సరాలుగా డంప్ చేస్తున్న వ్యర్థాలు భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాయని.. పలువురు ఆ కాలుష్యజలాల వల్ల క్యాన్సర్ బారిన కూడా పడ్డారని గతంలో పలువురు పర్యావరణవేత్తలు తెలిపారు. 

Trending News