ప్రతిపక్షాల ఐక్యతపై తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రధాని నరేంద్ర మోదీ

అవినీతిపరులంతా తమని తాము కాపాడుకోవడానికి ఏకమవుతున్నారు : ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : May 27, 2018, 12:52 AM IST
ప్రతిపక్షాల ఐక్యతపై తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తేలిగ్గా కొట్టిపారేశారు. అవినీతిపరులు అందరూ ఐక్యమవుతోంది దేశాన్ని కాపాడటం కోసం కాదు.. తమని తాము కాపాడుకోవడం కోసమే అని ప్రతిపక్షాల ఐక్యతను నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై విమర్శలు ఎక్కుపెట్టిన మోదీ.. ఈ ప్రభుత్వం జన్‌పథ్ (సోనియా గాంధీ అధికారిక నివాసం) నుంచి నడుస్తున్న ప్రభుత్వం కాదు.. జన్మత్ (ప్రజాభిప్రాయం) నుంచి నడుస్తోంది అని అన్నారు. తాను అవినీతిపై యుద్ధం ప్రకటించి దేశంలో నల్లధనాన్ని వెలికితీస్తోంటే, అది చూసి తట్టుకోలేని అవినీతిపరులు, అవినీతికేసుల్లో బెయిల్‌పై జైలు బయట ఉన్న వాళ్లంతా ఏకమై గగ్గోలు పెడుతున్నారని ప్రతిపక్షాలపై ఐక్యతను తనదైన స్టైల్లో చమత్కరించారు. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ తీసుకున్న కాంగ్రెస్ అధినేతలపై మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు.

ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిషాలోని కటక్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం పాలన మొదలుపెట్టినప్పుడు తాము అవినీతిని అస్సలు సహించబోం అని చెప్పినట్టుగానే చేసి చూపించామని చెబుతూ.. ప్రస్తుతం నలుగురు ముఖ్యమంత్రులు అవినీతి కేసుల్లో జైల్లో ఉన్నారు అని గుర్తుచేశారు. తమది చిత్తశుద్ధి వున్న ప్రభుత్వమే కానీ అయోమయం ఉన్న ప్రభుత్వం కాదు అంటూ ప్రతిపక్షాల ఐక్యతను మోదీ తీవ్రంగా ఏకిపారేశారు. 

Trending News