న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు కసరత్తు ప్రారంభించాయి. అందుకోసం వివిధ పక్షాల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందించడానికి నిరాకరించగా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ మజీద్ మోమన్ మాట్లాడుతూ, 'భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ పదవినుంచి తొలగించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. నోటీసుపై నేను సంతకం చేశాను. ఎంతమంది సంతకం చేశారన్న విషయాన్ని కాంగ్రెస్ అడిగి తెలుసుకోండి' అని అన్నారు. సంతకాలు చేసిన వారిలో ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారని, కాంగ్రెస్ ఎంపీలు కూడా సంతకాలు చేశారని మరో ఎన్సీపీ ఎంపీ డీపీ త్రిపాతి తెలిపారు. సీజేఐను పదవినుంచి తొలగించడానికి ప్రతిపక్షాలు ముసాయిదా తీర్మానంపై సంతకాలు ఎన్సీపీ ఎన్సిపి సీనియర్ నేత డిపి త్రిపాఠీ ప్రకటించారు.
సీజేఐను పదవి నుంచి తొలగించడానికి ప్రతిపక్షాల ముసాయిదా తీర్మాణానికి తాముకూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) ప్రకటించింది. న్యాయ వ్యవస్థకు స్వతంత్రత, ప్రశ్నించడానికి ఆస్కారం లేని సమగ్రత కల్పించడం కోసం ప్రవేశపెడుతున్న ఈ తీర్మానానికి తాము మద్దతు ఇస్తున్నామని ఎస్పి నేత ఘన్శ్యామ్ తివారీ చెప్పారు.
పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ కార్యాలయంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయి అభిశంసన తీర్మానంపై చర్చించినట్లు సమాచారం.