న్యూఢిల్లీ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల వెల్లడికి సంబంధించిన తేదీలను వెల్లడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణ విషయమై సెప్టెంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా శనివారం మీడియాతో మాట్లాడుతూ నవంబరు 2న హర్యానా అసెంబ్లీ గడువు, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఇసి సునిల్ అరోరా తెలిపారు. అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సిందిగా ఆయన రాజకీయ పార్టీలకు విఙ్ఞప్తి చేశారు.
సీఇసి సునిల్ అరోరా వెల్లడించిన వివరాల ప్రకారం ఈనెల 27న మొదలవనున్న నామినేషన్ల ప్రక్రియ అక్టోబరు 4న ముగుస్తుంది. రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబరు 21న పోలింగ్, అదే నెల 24న కౌంటింగ్ జరుగుతుందని స్పష్టంచేశారు.
అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల తేదీలు