నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితికా సింగ్, వెన్నెల కిషోర్ తదితరులు
కెమెరా: సాయిశ్రీరామ్
ఆర్ట్ : చిన్నా
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
మ్యూజిక్ : ప్రసన్
నిర్మాణం : కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా
దర్శకత్వం : హరినాథ్
రిలీజ్ డేట్: 24-ఆగస్ట్-2018
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ నటుడిగా మెస్మరైజ్ చేస్తున్న ఆది పినిశెట్టి మళ్ళీ హీరోగా పేక్షకుల ముందుకొచ్చాడు. హరినాథ్ డైరెక్షన్‌లో ఆది హీరోగా నటించిన ‘నీవెవరో’ ఈరోజే థియేటర్స్‌లో కొచ్చింది. మరి ఈ సినిమాతో ఆది హీరోగా ప్రేక్షకులను మెప్పించగలిగాడా ? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
అనుకోకుండా జరిగిన ఓ ఘటన వల్ల అంధుడిగా మారిన కళ్యాణ్ (ఆది పినిశెట్టి) పెద్దయ్యాక ఓ రెస్టారెంట్ నడుపుతూ అందులోనే చెఫ్‌గా పనిచేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. చిన్నతనం నుండి కళ్యాణ్‌ని ఇష్టపడుతూ పెళ్ళంటూ చేసుకుంటే తననే అని ఫిక్స్ అవుతుంది అను(రితిక సింగ్). అయితే అనుకోకుండా కళ్యాణ్ జీవితంలోకి వెన్నెల(తాప్సీ) వస్తుంది. కలిసిన కొన్ని రోజులకే వెన్నెలతో ప్రేమలో పడిపోతాడు కళ్యాణ్. ఈ క్రమంలో వెన్నెలను కాల్ మనీ గ్యాంగ్ డబ్బు కోసం వేధిస్తూ ఉంటుంది. తను ప్రేమించిన వెన్నెల కష్టం గురించి తెలుసుకొని తనకు సహాయపడాలని భావిస్తాడు కళ్యాణ్. అలా వెన్నెలకి సహాయపడేలోపే అనుకోకుండా ఓ యాక్సిడెంట్‌కి గురవుతాడు. ఆ ప్రమాదం తర్వాత వెన్నెల
కనుమరుగవుతుంది. యాక్సిడెంట్ నుండి బతికి బయటపడిన కళ్యాణ్... వెన్నెల గురించి వెతకడం మొదలుపెడతాడు. చివరికి కళ్యాణ్‌కు వెన్నెల దొరికిందా..? ఇంతకీ కళ్యాణ్ యాక్సిడెంట్ తర్వాత వెన్నెల ఎక్కడికి వెళ్ళింది.. ఇంతకీ వెన్నెల ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు :
అంధుడిగా ఆది పినిశెట్టి అదరగొట్టేసాడు. నటుడిగా ఎన్ని క్యారెక్టర్స్ చేసినా అంధుడి క్యారెక్టర్ చేయడం సాహసమే.. ఈ క్యారెక్టర్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న ఆది.. ఆ పాత్రకు బెస్ట్ ఛాయిస్ అనిపించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్‌తో సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. వెన్నెల క్యారెక్టర్‌కు తాప్సీ పర్ఫెక్ట్ అనిపించింది. ఇప్పటికే కొన్ని ఛాలెంజింగ్ రోల్స్‌తో అలరించిన తాప్సీ మరోసారి నటిగా ఆకట్టుకుంది. రితిక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్లస్ అయ్యింది. శివాజీ రాజా, తులసి వారి క్యారెక్టర్స్‌తో పరవాలేదనిపించారు. వెన్నెల కిషోర్ తన డైలాగ్ డెలివరీ, కామెడీతో నవ్వించాడు. సప్తగిరి కొంత వరకు నవ్వించగలిగాడు. రవి, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ అంధులుగా మెప్పించారు. శివన్నారాయణ, నర్రా శ్రీనివాస్, వైవ హర్ష, మహేష్ ఆచంట మిగతా నటీనటులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు :
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. సినిమాకు పర్ఫెక్ట్ బాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. అచ్చు రాజమణి- ప్రసన్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఏమో ఏమో పాట సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఈ పాటకు బాలాజీ అందించిన సాహిత్యం బాగుంది. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. చాలా సన్నివేశాల్లో సాయి శ్రీరాం కెమెరా పనితనం కనిపించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పరవాలేదు. కానీ ఇంకాస్త ట్రిమ్ చేయొచ్చు. ఆర్ట్ వర్క్ బాగుంది. హరినాథ్ డైరెక్షన్ పరవాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సహజమే.. కానీ తమిళ్‌లో అటు ఇటుగా కాస్త యావరేజ్‌గా ఆడిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోవడం బాగుంది కానీ దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేయడంలో మేకర్స్ విఫలం అయ్యారు. నిజానికి ఇది రీమేక్ చేసే స్టఫ్ ఉన్న పాయింటే. కాకపోతే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో పూర్తి స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయాడు దర్శకుడు. సినిమా స్టార్టింగ్‌లో కొంత సేపు బోర్ కొట్టించినా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌తో పరవాలేదనిపించాడు హరినాథ్. ఒరిజినల్‌తో పోలిస్తే తెలుగులో చేసిన కొన్ని మార్పులు సినిమాకు మైనస్ అనిపించాయి. ముఖ్యంగా కొన్ని అనవసరమైన సన్నివేశాలు, అసందర్భంగా వచ్చే ఫైట్ కథ ఫ్లోకు అడ్డుపడ్డాయి.
ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ట్విస్టులు ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉండాలి. సినిమాకు సోల్ అయిన ట్విస్టు సాధారణ ప్రేక్షకుడు కూడా ఊహించేలా ఉండటం పెద్ద మైనస్. ఈ పాయింట్‌కి స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా, అలరించేలా రాసుకుంటే బాగుండేది. ముఖ్యంగా సినిమాలో హైలైట్ అవ్వాల్సిన లవ్ సీన్స్, ఆది పినిశెట్టి - రితిక మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సీన్స్‌పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు దర్శకుడు.
కథ, కొన్ని సందర్భాల్లో ఆది పెర్ఫార్మెన్స్, ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్స్ కాగా నెరేషన్, క్యారెక్టరైజేషన్స్, కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్టుగా అనిపించడం, క్లైమాక్స్ సినిమాకు మైనస్.
ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టు సాగిపోయే ఈ థ్రిల్లర్ మూవీని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ : 2 / 5
జీ సినిమాలు సౌజన్యంతో..