Divya Bharathi Death Mystery: దివ్యభారతి.. ఆ కాలంలో సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ హీరోయిన్. అతిపిన్న వయసులోనే అసాధారణ గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఆమె మరణం నేటికీ మిస్టరీనే! అంత స్టార్ హీరోయిన్ అనుమానాస్పదంగా మృతి చెంది ఏళ్లు గడిచినప్పటికీ.. ముంబై పోలీసులు మాత్రం ఈ కేసులో ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది ? ఎందుకు దివ్యభారతి మృతి కేసు ఓ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది ? ఆమె మనకు దూరమై మూడు దశాబ్ధాలు పూర్తి కావస్తున్నా.. ఇంకా ఆమె జ్ఞాపకాలు పదిలంగానే మిగిలిపోయాయి.. ఆ ఆ జ్ఞాపకాలన్నింటినీ మరోసారి నెమరేసుకుందాం.
అది 1993.. ఏప్రిల్ 5. మరో అరవై నిమిషాలు గడిస్తే తేదీ మారుతుందనగా ముంబైని ఒక్కసారిగా సునామీ లాంటి వార్త ముంచెత్తింది. టీనేజ్ సంచలనం, అందాల నటి దివ్యభారతి ఆత్మహత్య చేసుకుందన్న ఆ వార్త ప్రతీ ఒక్కరిని కలవరానికి గురిచేసింది. పంతొమ్మిదేళ్ల వయసు, మోయలేనంత స్టార్‌డమ్, అసాధారణ భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? ఎవరో కావాలనే ఆమెను హతమార్చారంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. సక్సెస్ కిక్కును తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందేమో అంటూ కొందరు నిట్టూర్చారు.
ఆ రోజు దివ్యభారతిని చూసిన వాళ్లంతా చాలా హుషారుగా ఉందని చెప్పారు. చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రానికి ముంబై చేరుకుంది. తన సంపాదనతో కన్నవాళ్ళకి ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలనుకొని.. షూటింగ్ నుండి మధ్యలోనే తిరిగి వచ్చేసింది. సోదరుడితో కలిసి ఆ ఫ్లాట్ సందర్శించింది. కొనుగోలు వ్యవహారాల్లో ఆ రోజంతా తలమునకలై ఉండటంతో మరుసటిరోజు హైదరాబాద్‌లో షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. నిర్మాతలకు ఫోన్ చేసి, తాను అలసిపోయానని.. ఒకరోజు విశ్రాంతి తీసుకుని వస్తానని చెప్పింది.
దివ్య భారతి భర్త, ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాతో కలిసి అంధేరీ ప్రాంతంలోని తులసీ అపార్ట్‌మెంట్లో నివసించేది. ఆరోజు రాత్రి 10 గంటలకు తులసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. అప్పటికి పనిమనిషి అమృత మాత్రమే ఇంట్లో ఉంది. చిన్ననాటి నుంచీ దివ్యభారతి ఆలనాపాలనా అమృత యే చూసుకుంది. దివ్యభారతి బెడ్‌రూమ్‌లోకి చేరి, కాసేపు నడుం వాల్చగానే ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా నుంచి ఫోన్ వచ్చింది. తన భర్త శ్యామ్ లుల్లాతో కలిసి తులసీ అపార్ట్‌మెంట్‌కు వస్తున్నానని చెప్పింది. ఆ ఫోన్ పెట్టేయగానే మద్యం బాటిళ్లు సిద్ధం చేసింది దివ్యభారతి. ముగ్గురూ కలిసి ఆమె బెడ్రూమ్‌లోనే మద్యం తాగారు.
కాసేపటి తర్వాత లేచి అటూ ఇటూ నడుచుకుంటూ మాట్లాడుతోంది దివ్యభారతి. అలా మాట్లాడుతూనే బాల్కనీ వైపు నడుచుకుంటూ వెళ్లింది. బాల్కనీలో ఉన్న కిటికీకి తలుపులు లేవు. ఆ సమయంలోనే ఒక్కసారిగా ఆ కిటికీలోంచి ముందుకు తూలింది. ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఆ భారీ శబ్దానికి అపార్ట్‌మెంట్‌లోని మిగతావాళ్లంతా బయటకు వచ్చారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దివ్యభారతిని ఆసుపత్రికి తరలించారు. కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివ్యభారతి ప్రాణాలు కోల్పోయింది.
ఇప్పటివరకూ దివ్యభారతి మరణం గురించి పోలీసు రికార్డుల్లో ఉన్న వివరాలు ఇవి. ఈ ఘోరంపై చివరి క్షణంలో పక్కనే ఉన్న నీతా, శ్యామ్ లుల్లాలు ఏరోజూ నోరు మెదపలేదు. ఆమె భర్త సాజిద్ కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక వంట మనిషి అమృత నెలరోజులకే గుండె ఆగి చనిపోయింది. దీంతో ఇది హత్యా, ఆత్మహత్యా, లేదంటే ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా? అనే అంశాలు మిస్టరీగానే మారాయి. కానీ, ఈ మరణం వెనక దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ గ్యాంగ్ ప్రమేయం ఉందనే పుకార్లు అప్పట్లో హల్‌చల్ చేశాయి.
దివ్య భారతి భర్త సాజిద్ నదియాడ్‌వాలా (Sajid Nadiadwala) ఉద్దేశపూర్వకంగానే భార్యను హత్య చేయించాడనే ప్రచారం కూడా జరిగింది. ముంబై పేలుళ్ల కేసు నుంచి బయటపడేందుకే ఇలా చేశాడని కూడా కొంతమంది సిద్ధాంతీకరించారు. ఆరోపణలు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ముంబై పోలీసులు మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆధారాలూ సంపాదించలేకపోయారు. దీంతో, 1998లో దివ్య భారతి మృతి కేసు విచారణ ముగిసింది. దివ్యభారతి మరణానికి కారణం ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పకుండానే పోలీసులు కేసు ఫైల్‌ని మూసేశారు. ఇంతకీ ఆమెది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా..? నిజం దివ్యభారతి మాత్రమే చెప్పగలదు. కానీ, ఆమె ఎలాగూ మనమధ్య లేదు కనుక ఇక ఆ వాస్తవం ఎప్పటికీ బయటపడదు.
Also read : RRR Collections: రూ. 1000 కోట్ల క్లబ్ దాటిన ఆర్ఆర్ఆర్.. తొక్కుకుంటూ పోతున్న తెలుగు సినిమా
Also read : Hrithik Roshan-Sussanne Khan: హవ్వ.. ఇదెక్కడి లవ్ స్టోరీ.. లవర్స్‌తో మాజీ భార్యాభర్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook