Maoist Recruitment in Telangana: తెలంగాణ జిల్లాల్లో కొత్తగా మావోయిస్టు పార్టీలో చేరే వారి సంఖ్య దాదాపు కరువైంది అని అనుకుంటున్న తరుణంలో మావోయిస్ట్ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తూ, మావోయిస్టుల రిక్రూట్మెంట్లకి సహకరిస్తున్నాడనే నేరం కింద కొత్త అరెస్టులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాతికేళ్లపాటు ఉవ్వెత్తున ఎగిసిపడిన విప్లవోద్యమం ప్రస్తుతం ఉనికి కూడా లేకుండా పోయింది. మావోయిస్టు పార్టీకి దశాబ్ద కాలానికి పైగా కొత్త రిక్రూట్మెంట్లు జరిగిన దాఖలాలే లేవు. అలాంటిది అనూహ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు మండలం కొరటికల్ గ్రామం చెన్నగోని గణేష్ అరెస్టు కలకలం రేపింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఆగరగూడ అటవీ ప్రాంతంలో అదే మండలం జిల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనందరావుతో పాటు చెన్నగోని గణేష్ అరెస్ట్ కావడం జరిగింది. మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా వారు కొత్త రిక్రూట్మెంట్లకు సహకరిస్తున్నారని.. మావోయిస్టుల అవసరాల కోసం జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు హైద్రాబాద్‌లో కొనుగోలు చేసి వాటిని మావోయిస్టులకు అందించేందుకు వెళ్తుండగా వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డారని పోలీసులు చెప్పడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారింది.
తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్ కరువైపోయిందనుకున్న తరుణంలో తాజాగా మావోయిస్టులకు సహకరిస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారనే వార్తకు ప్రాధాన్యత చేకూరింది. అరెస్ట్ అయిన ఆనందరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి పిహెచ్‌డి చదువుతున్నాడు. పిడిఎస్ యు, కుల నిర్మూలన వేదిక కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఓవైపు పీహెచ్డీ చేస్తూనే మరోవైపు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో క్యాటరింగ్ బోయ్‌గానూ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
కోట ఆనంద రావు, చెన్నగోని గణేష్ అనే ఇద్దరు యువకుల అరెస్ట్ కొత్తగా తెలంగాణలో మావోయిస్టు పార్టీకి చాప కింద నీరులా కొత్త రిక్రూట్మెంట్ దిశగా యువత ఆకర్షితులు అవుతున్నారా అనే అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ అదే కానీ నిజమైతే... తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అందుకు ఎంతవరకు కారణం అవుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ – చత్తిస్‌ఘడ్ సరిహద్దు జిల్లాల్లో మాత్రమే కొత్త రిక్రూట్మెంట్లు జరుగుతున్నట్టు తరుచుగా జరుగుతున్న అరెస్టు ఘటనలు స్పష్టంచేస్తున్నాయి. ఇదిలావుంటే, మరోవైపు చెన్నగోని గణేష్ కుటుంబ సభ్యులు గణేష్ అరెస్టుని ఖండిస్తూ పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. అన్యాయంగా పోలీసులు గణేష్‌ని మావోయిస్టు కేసుల్లో ఇరికించారని, వాడికి ఏమీ తెలియదని, హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడని చెన్నగోని గణేష్ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం.