Vijayawada TDP Parliament Seat: ఏపీ రాజకీయాల్లో మరో ఊహించని పరిణాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ టీడీపీలో అన్నదమ్ముల ఆధిపత్య పోరు నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానికి మొండి చెయ్యి చూపించారు. ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ నేతలతో ద్వారా ఈ విషయాన్ని కేశినేని నానికి స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాల్లోనూ జోక్యం చేసుకోవద్దంటూ తెగేసి చెప్పేశారు. ఇలా చెప్పడం ద్వారా నానిని దాదాపు పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని నానియే స్వయంగా వెల్లడించారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తనను కలిశారని వెల్లడించారు నాని. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా తన స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారనీ.. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పారన్నారు. అధినేత ఆజ్ఞలను తూచ తప్పకుండా శిరసావహిస్తానని తాను వారికి హామీ ఇచ్చినట్లు కేశినేని నాని తెలిపారు.
విజయవాడ టీడీపీలో దాదాపు ఏడాదిన్నర నుంచి కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్నల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని గెలుపులో చిన్ని కీలక పాత్ర పోషించారు. అయితే ఆస్తి వివాదాల్లో తలెత్తిన పేచీ.. ఇద్దరి మధ్య దూరం పెంచింది. దీంతో సొంతంగా రాజకీయాల చేస్తున్నారు చిన్ని. మరోవైపు విజయవాడ టీడీపీలో కీలక నేతలంతా కేశినేని నానికి వ్యతిరేకంగా ఒకటయ్యారు. పరస్పర విమర్శలతో పరిస్థితి అదుపు తప్పించింది. దీంతో విజయవాడ టీడీపీలో కేశినేని నానితో విభేదించే వారంతా నాని పక్షాన చేరారు. గత కొంత కాలంగా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం.. తిరువూరు ఘర్షణతో అలర్ట్ అయ్యింది.
తిరువూరులో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్లిన సమయంలో ఫ్లెక్సీల తో ఫోటోల విషయంలో వివాదం తలెత్తింది. దాంతో పార్టీ కార్యాయలంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎంపీ కేశినేని నేనిదే తప్పని టీడీపీ అధిష్టానం తేల్చినట్లు సమాచారం. దాంతో ఆయన్ను పక్కకు తప్పించిందని అంటున్నారు. ఈ సారి కేశినేని నానికి బదులుగా విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి చిన్నిని రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి ఇది బలమైన నియోజకవర్గం కావడంతో.. విజయవాడ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
అటు కొంత కాలంగా పార్టీ కార్యకలాపాల్లో చిన్ని చురుగ్గా పాల్గొంటున్నారు. నానికి ప్రాధాన్యత తగ్గిస్తూ చిన్ని అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది. లోకేష్ పాదయాత్రలో కూడా చిన్న యాక్టివ్‌గా పాల్గొన్నారు. నాని మాత్రం దూరంగా ఉన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత లోకేష్‌తోనూ చిన్ని భేటీ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మొండి చేయి చూపించడంతో కేశినేని నాని అడుగులు ఎటు వైపు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా ? లేక వేరే పార్టీలో చేరతారా అన్నది సస్పెన్స్‌గా మారింది.
Also Read: Guntur Kaaram Update: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి