తిరుమలేశుడి దర్శనానికి రైళ్లో ప్రయాణించే ప్రయాణికులు.. స్టేషన్లో దిగాక ఆర్టీసి బస్సు ఎక్కి నేరుగా తిరుపతి కొండపైకి వెళ్లేందుకు.. ఇక నుండే రైళ్ళలో కూడా బస్ టిక్కెట్లు విక్రయించనున్నారు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ బస్ టిక్కెట్ల ప్రాజెక్టు మొదటి విడత సర్వీసులు నారాయణాద్రి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు అందిస్తున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక నుండి తిరుపతికి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ సౌలభ్యాన్ని కల్పించనున్నారు.
ఈ మధ్యకాలంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసి కండక్టర్లు తిరుపతి ముందు స్టేషన్లో రైలు ఆగగానే ఎక్కి ప్రయాణికులకు ఈ టికెట్లను అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఆర్టీసి శాఖ, రైల్వే శాఖతో తాత్కాలికంగా ఏర్పరచుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అధికారులు.. మరిన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఈ బస్ టికెట్ల విక్రయాన్ని చేపట్టే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.