అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ హత్య కేసు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పెద్ద సంచలనం నమోదు చేసిందో తెలియంది కాదు. ఈ హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే ఎంక్వయరీ ముమ్మరంగా సాగుతోంది. హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారి వివరాలు అన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి తాజాగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
కొర్ర కమల, ఈశ్వరి, సుబ్బారావు, శోభన్ అనే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు నలుగురూ మావోయిస్టులకు వార్తాహరులుగా వ్యవహరించి.. స్థానిక సమాచారాన్ని సేకరిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు సంబంధించిన ప్రతీ కదలికకు సంబంధించిన సమాచారాన్ని వీరే మావోలకు చేరవేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే.. నిందితులు కూడా ఈ విషయానికి సంబంధించి తామే కారకులమని ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసులు కూడా పూర్తిస్థాయి ప్రణాళికను రచించే మావోయిస్టులు హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నారని నిందితులే తొలుత మావోయిస్టులకు సమాచారం అందించారని.. ఆ సమాచారాన్ని బట్టే లివిటిపట్టు ప్రాంతాన్ని మావోయిస్టులు ఎంచుకున్నారని ఈ కేసును ఎంక్వయరీ చేస్తున్న సిట్ సభ్యులు ఫకీరప్ప మీడియాతో తెలిపారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు.. మళ్లీ తమ ప్రాబల్యాన్ని తెలియజేయడానికే ఈ హత్యకు పాల్పడ్డారని.. ప్రభుత్వం కూడా ఈ హత్యల తర్వాత నిఘా వ్యవస్థని పటిష్టం చేసిందని.. పోలీసులు అంటున్నారు.
అరకు ఎమ్మెల్యే హత్య కేసు: నలుగురు అరెస్ట్