Chandrababu, YS Jagan: ఒకే వేదికపైకి వైఎస్ జగన్, చంద్రబాబు.. ఎవరి వెర్షన్ వారిది

Chandrababu Naidu Meets PM Modi: G20 సదస్సు సన్నాహక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. యువ శక్తి మన దేశానికి ఉన్న గొప్ప బలం అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

Written by - Pavan | Last Updated : Dec 6, 2022, 05:14 AM IST
Chandrababu, YS Jagan: ఒకే వేదికపైకి వైఎస్ జగన్, చంద్రబాబు.. ఎవరి వెర్షన్ వారిది

Chandrababu Naidu Meets PM Modi: 2023 లో భారత్ జీ-20 దేశాల సదస్సుకు అధ్యక్ష దేశంగా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాజకీయాలను పక్కనపెడుతూ దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా భారత్ వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అఖిలపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అదే సమయంలో అఖిలపక్షానికి హాజరైన నేతల అభిప్రాయాలు, విలువైన సూచనలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ఒకే వేదికపైకి, అది కూడా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే చోట కలవడం ఒకింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు.. భవిష్యత్తులో దేశాభివృద్ధిలో డిజిటల్ నాలెడ్జ్ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. భారత దేశ భవిష్యత్తుపై రాబోయే మరో 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలి అని కేంద్రానికి సూచించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో నంబర్ 1 లేదా నంబర్ 2  దేశంగా అవతరించే సత్తా భారత్ కు ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. 

యువ శక్తి మన దేశానికి ఉన్న గొప్ప బలం అని చెప్పుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు.. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తిని, అపారమైన నాలెడ్జ్ ఎకానమీని అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని.. అదే దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని వివరించారు. 

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ నాలెడ్జ్ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ అఖిలపక్షానికి దిశానిర్ధేశం చేశారు. జి20 సదస్సుకు దేశం ఎలా సన్నద్దం కావాల్సిన అవసరం ఉందో అఖిలపక్ష నేతలకు వివరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించేలా తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాజకీయాలను, విబేధాలను పక్కనపెట్టి దేశం కోసం అందరం ఏకమై పని చేయాల్సిన సందర్భం ఇది అని జగన్ చెప్పుకొచ్చారు.

Trending News