బాలయ్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కమలనాథులు

Last Updated : Apr 21, 2018, 12:25 PM IST
బాలయ్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన కమలనాథులు

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  ఏం మాట్లాడినా సంచనలమే..అది వివాదమే. శుక్రవారం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష సందర్భంలో బాలయ్య ప్రసంగం మరోసారి వివాదాస్పదంగా మారాయి. ప్రధాని మోడీపై బాలకృష్ణ  అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఏకంగా గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు ఉదయం  బీజేపీ నేతలు  విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ గవర్నర్ ను కలుసుకున్నారు. ప్రధాని మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా అంగీకరించిన చంద్రబాబుపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. 

అసలు బాలయ్య ఏమన్నారంటే ...

మోడీ తనకు ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని ..ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తెలుగువారు చూస్తూ ఊరుకోరని బాలకృష్ణ హెచ్చరించారు . నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా కేవలం మట్టి, నీళ్లు ఇచ్చి కేంద్ర పెద్దలు చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. తెలుగువారి సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఉత్తర, దక్షిణ భారత దేశం అంటూ రాష్ట్రాల్లో మోడీ విబేధాలు సృష్టిస్తున్నారని బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 

రాజకీయాల్లో చంద్రబాబు ప్రధాని మోడీ కంటే సీనియరి అని..అలాంటి వ్యక్తిని అవమానించడం దారుణమన్నారు. అనుభవజ్ఞులను ఎలా గౌరవించాలో మోదీ నేర్చుకోవాలని ఆయన చురకలు అంటించారు. ప్రధాని ఎవరెవరితోనో కుప్పిగెంతులు వేయిస్తూ చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారని బాలకృష్ణ విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో బాలయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

Trending News