ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో ఏపీ విద్యాశాఖ ప్రకటించిన తేది ప్రకారం గురువారం నోటిఫికేషన్ విడుదల అవ్వాలి. కానీ, ఆర్థిక శాఖ నుండి అనుమతి ఇంకా రాకపోవడంతో ప్రస్తుతం ఆ ఆలోచనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,351 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అలాగే ఈ మధ్యకాలంలో సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే అని ఎన్‌సీటీఈ ప్రకటించడంతో ప్రస్తుతం ఆ విషయంలో కూడా గందరగోళం నెలకొంది. అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసే వారు కూడా అర్హులే అని తెలియడంతో.. ఆ పోస్టులకు వీలైతే టీఆర్‌టీతో పాటు మళ్లీ టెట్ కలిపి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఈ పద్ధతి వర్తించదు. వారు ఇప్పటికే టెట్ రాసి ఉన్నారు కాబట్టి.. వారు టీఆర్‌టీ ఒకటే రాస్తే సరిపోతుంది.
అయితే పదే పదే ఉపాధ్యాయ నియామక పరీక్షలు వాయిదా పడుతుండడంతో అభ్యర్థులలో అసహనం పెరిగిపోతోంది. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను రూపొందించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. అలాగే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తే.. పరీక్షల నిర్వహణను ఏపీపీఎస్సీకి ఇస్తుందా లేదా అన్న అంశంపై కూడా ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.