అమెరికా ప్రభుత్వానికి చెందిన నిర్వహణ కార్యక్రమాలు శనివారం స్తంబించాయన్న విషయం మనకు తెలిసిందే. అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు మధ్య ఏర్పడుతున్న అగాథమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు కొందరు రాజకీయవేత్తలు. ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చుపెట్టే నిధులను సమకూర్చే క్రమంలో చేసుకొనే ఒప్పందంలో సెనెట్ సభ్యులు విఫలం అవ్వడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇరు వర్గాలు కూడా ఎవరికి వారే రాజీపడడానికి ఇష్టపడకపోవడంతో పరిస్థితి విషమస్థాయికి చేరింది. సాధారణంగా సెనేట్ తాత్కాలిక వ్యయ బిల్లును ఆమోదించి నిధులు సమకూర్చుకోవాలి. కానీ బడ్జెట్ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి అదుపు తప్పింది. సరిగ్గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ విధంగా జరగడంతో.. అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ప్రజలపై ప్రభావం ఏమీ పడలేదు. కానీ.. సోమవారం పరిస్థితి ఏంటి అన్నదాని పైనే ఇంకా చర్చ కొనసాగుతోంది. సెనెట్ చర్చలు విఫలమయ్యాయి కాబట్టి... ఫిబ్రవరి 8వ తేది వరకు నిధులు సమకూరేలా ఓటింగ్ ఉండాలని ఇప్పటికే అమెరికాలోని కొందరు రాజకీయ నిపుణులు కోరుతున్నారు. మరి ఏం అవుతుందో వేచి చూడాల్సిందే..