హైదరాబాద్: రాజకీయాల జోలికి వెళ్లకుండా కామ్ గా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి.. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా తాను తెలంగాణవ్యాప్తంగా ప్రచారం చేస్తానని తెలిపారు.
దొడ్డిదారిన క్రెడిట్ కొట్టేశారు..
తెలంగాణ ఇచ్చిన ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ దే అని..అయితే ఆ క్రెడిట్ కేసీఆర్ దొంగచాటున కొట్టేశారని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు..తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ కాళ్ల పైన పడి పార్టీని కలిపేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని.. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మాట మార్చారని విజయశాంతి విమర్శించారు.
వారసుల కోసమే సస్పెండ్ చేశారు...
టీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన తనను ఎందుకు పార్టీ నుంచి గెంటేశారో ఇప్పటి వరకు చెప్పలేదని ఆరోపించారు. బహుశ కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలకు అడ్డొస్తాననే భయపడే కేసీఆర్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని విజయశాంతి పేర్కొన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ సాధ్యపడదు
ఫెడరల్ ఫ్రంట్‌కు జాతీయ పార్టీలను ఒప్పించలేని కేసీఆర్ పూర్తిగా విఫలమ్యాయరని..ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణ సీఎం.. ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని తెరపైకి తెచ్చినాటకాలు ఆడుతున్నారని విజయశాంతి ఘాటుగా విమర్శించారు