హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డిపై మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లా రెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూనే కార్మికుల పొట్టకొట్టడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని మల్లా రెడ్డిపై నాయిని నర్సింహా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాచారంలోని లిక్కర్ ఇండియా కంపెనీ యాజమాన్యం వద్ద డబ్బులు తీసుకుని అదే కంపెనీలో పనిచేస్తోన్న 9 మంది కార్మికుల పొట్టగొట్టారని మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖర్చుచేసిన డబ్బును మున్సిపల్ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు టికెట్లు అమ్ముకోవడం ద్వారా తిరిగి సంపాదించారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నారని తాను మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని.. అయితే, ఇవన్నీ మల్లారెడ్డి ముందే చెబుతారా అని అడిగితే... చెప్పమంటే చెప్త లేదంటే ఊకుంటానని తాను మంత్రి కేటీఆర్‌తో చెప్పానని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం నాయిని నర్సింహా రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ సీటుపై నాయిని ధీమా..
త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభ సీటుపై నాయిని స్పందిస్తూ.. ''తనను రాజ్యసభకు పంపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని.. అలాగే పంపిస్తారనే నమ్మకం ఉంది'' అని ధీమా వ్యక్తంచేశారు. ''కేబినెట్లో అవకాశం కల్పించకపోతే.. రాజ్యసభకు అవకాశం కల్పించాలని కేబినెట్ విస్తరణ సమయంలోనే కోరానని.. అందుకు సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. 'నేను చూసుకుంటా.. ఏం ఫికర్ పడకు'' అని చెప్పారని నాయిని గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్‌కి ఆ విషయాన్ని గుర్తుచేయడం కోసమే పలు సందర్భాల్లో ఆయనను కలిశానని నాయిని నర్సింహా రెడ్డి తెలిపారు.
Read also : టీఆర్ఎస్ పార్టీ మాదే..: నాయిని నర్సింహా రెడ్డి
కేసీఆర్‌పైనా నాయిని కామెంట్స్..
ఇదే విషయమై సీఎం కేసీఆర్‌పైనా నాయిని నర్సింహా రెడ్డి గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కౌన్సిల్లో ఉంటే తనకు మంత్రి పదవి ఇస్తానని చెబుతూ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన మాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. గులాబీ పార్టీకి తాను కూడా ఓనర్నేనని.. కేసీఆర్ మా ఇంటికి పెద్దని చెప్పుకొచ్చిన నాయిని నర్సింహా రెడ్డి... కిరాయిదారులు ఎంతకాలం ఉంటారో ఉండి వెళ్లిపోతారని పరోక్షంగా టీడీపీ నుంచి వచ్చిన నేతలను ఉద్దేశించి నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారంరేపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..