MLA Jagga Reddy on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని.. పంచాయతీ అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ పంచాయితీ కాదని.. తమ ఇద్దరి మధ్య పంచాయితీ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో పనిచేయడానికి తనకెటువంటి ఇబ్బంది లేదని.. ఇదే విషయాన్ని పలుమార్లు బహిరంగంగా వెల్లడించానని తెలిపారు. అయినా తనపై సోషల్ మీడియా వేదికగా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తనపైనే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీహెచ్‌లపై కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు.
పీసీసీ చీఫ్ కావాలని తాను అనుకున్నానని... కానీ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి పనిచేస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం తానొక్కడినే కేసీఆర్‌ను వ్యతిరేకించానని... అలాంటి జగ్గారెడ్డి ధైర్యాన్ని ప్రశ్నించే నాయకులు ఇప్పుడొచ్చారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తనకు అలవాటు అన్నారు. తన జీవిత కాలమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని... ఈ పార్టీలోనే ఎదిగానని.. ఇక్కడున్న మజా ఎక్కడా లేదని అన్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయ ఝలక్ ఇస్తానని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల మెదక్ పర్యటన సందర్భంగా తనకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి.. తనకు సమాచారం ఇచ్చాడు కానీ రమ్మని ఆహ్వానించలేదన్నారు. ఇదే విషయంపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌కు ఫోన్ చేసి తాను కోప్పడ్డానని తెలిపారు. దాంతో రేవంత్ రెడ్డి మళ్లీ తనకు ఫోన్ చేసి.. తనతో పాటు మెదక్ రావాల్సిందిగా కోరాడన్నారు. కానీ తీరా సమయానికి తనకు చెప్పకుండానే మెదక్ పర్యటనకు వెళ్లారని మండిపడ్డారు. అది తనను బాధించినట్లు చెప్పారు.
రేవంత్ రెడ్డికి అందరినీ కలుపుకుని వెళ్లి పనిచేసే తత్వం ఉందా లేదా ఆయనే ఆలోచించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. తనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసి కూడా రేవంత్ రెడ్డి తన పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగా లేదన్నారు. రేవంత్ రెడ్డి తన పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైనదేనా అని రేవంత్ మద్దతుదారులను ప్రశ్నిస్తున్నానని అన్నారు. తనకే ఇంత సినిమా చూపిస్తే.. ఇక జిల్లా నేతల పరిస్థితేంటన్నారు.
రేవంత్ రెడ్డి నాతో ఏం చెప్పారంటే :
ఇటీవల అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డితో కలిసిన సందర్భంగా.. ఆయనేదో తనను బుజ్జగించినట్లు అంతా భావించారన్నారు. కానీ అక్కడ జరిగింది వేరే అని చెప్పారు. 'జగ్గన్నా.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం సీరియస్‌గా ఉన్నట్లు నాకు తెలిసింది.. ఏ క్షణమైనా ఆయనకు ఏమైనా జరగొచ్చు.. గవర్నర్ అలర్ట్‌గా ఉండాలని కేసీఆర్ ఇంట్లో నుంచి ఫోన్ వెళ్లింది. మనమంతా అలర్ట్‌గా ఉందాం. కేటీఆర్ సీఎం అవుతాడా కాదా.. మనమంతా రెడీగా ఉండాలి.' అని రేవంత్ తనతో చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డిది ఏం రాజకీయమో అర్థం కావట్లేదని.. ఆయనకు చంద్రబాబు సరిగా ట్రైనింగ్ ఇచ్చినట్లు లేరని ఎద్దేవా చేశారు.
Also Read: Jagga Reddy: రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్... సంచలన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook