KTR About Revanth Reddy's Comments on Electricity Supply For Farmers: కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రైతులను ఉద్దేశించి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... నిన్న ధరణిని తీసేస్తాం అన్నాడు.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడు అంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అంటే.. నేడు వ్యవసాయానికి మూడుపూటల కరెంట్ దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు అంటూ రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు.
మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అని వ్యాఖ్యానించడమంటే.. ముమ్మాటికీ అది సన్నకారు రైతులను, చిన్నకారు రైతులను అవమానించడమే అవుతుంది అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్నకారు రైతులంటే చిన్నచూపేనని.. సన్నకారు రైతు అంటే సవతిప్రేమేనని ఆరోపించారు. నోట్లు తప్ప... రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం అంటూ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అన్నదాత నిండా మునుగుడు పక్కా అని మండిపడ్డారు.
నాడు ఏడు గంటలు కరెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీ నేడు ఏకంగా తమ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత కరెంటుకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోంది అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 3 గంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి... అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం అయినట్టేనని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం అంటూ హెచ్చరించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయంగా అభివర్ణించారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా ? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ? అనేది తేల్చుకోవాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే తమకు మేలు కలుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
KTR About Revanth Reddy: 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం