సంగారెడ్డి: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్ట్‌లు నిర్మించలేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెబుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, సింగూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదుల వంటి అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ హయంలోనే నిర్మించారని అన్నారు. క్రితం కేబినెట్‌లో ఐదేళ్లు మంత్రిగా వున్న హరీశ్ రావు ఎన్ని ప్రాజెక్ట్‌లు నిర్మించారో చెప్పాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా హరీష్ రావుపై విమర్శలు గుప్పించిన జగ్గా రెడ్డి.. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ప్రాజెక్ట్‌లు కట్టారనే అంశంపై తాను చర్చకు సిద్ధమని.. హరీశ్ రావుకు దమ్ముంటే అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా హరీశ్ రావులా తాను గోతులు తీసే రకం కాదని జగ్గా రెడ్డి వ్యాఖ్యానించారు.
జగ్గా రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఓవైపు వార్తలొస్తున్న తరుణంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని సమర్థించుకుంటూ హరీష్ రావుపై విమర్శలు చేసిన తీరు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది.
హరీష్ రావుకి జగ్గా రెడ్డి సవాల్