మాజీ పైలట్‌పై కత్తులతో దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు

అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని సీసీటీవీ కెమెరాల్లో అక్కడ జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలుపూర్తిగా రికార్డ్ అయ్యాయి.

Last Updated : Jan 11, 2018, 12:19 PM IST
మాజీ పైలట్‌పై కత్తులతో దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని ఎలిగంట్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో నివాసం వుంటున్న ఇక్రం అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి వేళ జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇక్రంని కుటుంబసభ్యులు బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. దాడిపై సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పంజగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని సీసీటీవీ కెమెరాల్లో అక్కడ జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలుపూర్తిగా రికార్డ్ అయ్యాయి.

దుండగుల దాడిలో తల, చేతులు, వీపు భాగాల్లో తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఇక్రం ప్రాణాలకి ప్రస్తుతం ఎటువంటి హాని లేదని ఏసీపీ తెలిపారు. వృత్తిరీత్యా గతంలో సౌది అరేబియాలో పైలట్‌గా పనిచేసిన ఇక్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే వుంటూ ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఇక్రంపై దాడి జరిగిందంటున్న అతడి కుటుంబసభ్యులు.. అప్పట్లో దాడికి పాల్పడిన వారే ఇప్పుడు కూడా దాడికి తెగబడి వుండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇక్రం కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే, భూతగాదాలే అతడిపై దాడికి కారణమై వుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Trending News