హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. బేగంపేటలో ఆఫ్రికా వ్యక్తి అరెస్టు

భాగ్యనగరంలో మళ్లీ డ్రగ్స్ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం బేగంపేట బీఎస్ మక్తా ప్రాంతంలో గతకొంతకాలంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ ఆఫ్రికన్ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

Last Updated : Sep 2, 2018, 02:09 PM IST
హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. బేగంపేటలో ఆఫ్రికా వ్యక్తి అరెస్టు

భాగ్యనగరంలో మళ్లీ డ్రగ్స్ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం బేగంపేట బీఎస్ మక్తా ప్రాంతంలో గతకొంతకాలంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ ఆఫ్రికన్ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి పేరు పీటర్ అని వారి దర్యాప్తులో తేలింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తనవద్ద ఉన్న 100 గ్రాముల కోకైన్‌తో పాటు రూ.లక్షను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం  పోలీసులు ఈ కేసుకు సంబంధించి అదనపు సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తర్వాత ఎక్సైజ్ శాఖ (ఎస్‌టీఎఫ్‌) అధికారులకు కూడా సమాచారం అందించారు. ఇటీవలే రాజేష్ అనే ఓ వ్యక్తిని కూడా డ్రగ్స్ కేసులో కొత్తపేట ఏరియాలో పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాయచూర్ నుండి డ్రగ్స్ టాబ్లెట్లు తీసుకొచ్చి.. వాటిని యాభై నుంచి వంద రూపాయలకు అమ్ముతూ ఆఖరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మధ్యకాలంలో ఎక్సైజ్, ఎన్ ఫోర్స్‌మెంట్ శాఖ చేపట్టిన గాలింపు చర్యల్లో కూడా ఘట్ కేసర్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన మాదకద్రవ్యాలు భారీస్థాయిలో బయటపడ్డాయి. 

అలాగే పదిహేను రోజుల క్రితం రెండు డ్రగ్ మాఫియా ముఠాలను ఎక్సైజ్ శాఖ హైదరాబాదులోనే పట్టుకుంది. డ్రగ్ డీలర్‌గా పేరుగాంచి అబ్దుల్ అనే వ్యక్తికి భారీ స్థాయిలో కస్టమర్లు ఉన్నారని కూడా వారి ఎంక్వయరీలో తేలింది. డ్రగ్స్‌కు కోడ్ భాష పెట్టి వాటిని సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల పిల్లలకు అబ్దుల్ అమ్మేవాడని పోలీసులు తెలిపారు. తాజాగా బేగంపేటలో డ్రగ్స్ అమ్ముతూ ఓ ఆఫ్రికా వ్యక్తి కూడా పట్టుబడడంతో.. పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి ఇన్ని కేసులు నమోదవ్వడంతో.. సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా సత్వర చర్యలు వెంటనే తీసుకోవాలని కొన్ని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 

Trending News