తొలి టీ20లో విండీస్‌పై భారత్ విజయం.. మెరిసిన నవ్‌దీప్

తొలి టీ20లో విండీస్‌పై భారత్ విజయం.. మెరిసిన నవ్‌దీప్

Last Updated : Aug 4, 2019, 05:20 PM IST
తొలి టీ20లో విండీస్‌పై భారత్ విజయం.. మెరిసిన నవ్‌దీప్

ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు కట్టడి చేయడంతో విండీస్ ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగలిగారు. విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కూడా తొలుత తడబడినట్టే కనిపించినప్పటికీ... ఆ తర్వాత కుదురుకోవడంతో 17.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి వెస్టిండీస్‌పై విజయం సొంతం చేసుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యం సాధించినట్టయింది.

వరల్డ్ కప్‌లో గాయం కారణంగా వెనుతిరిగొచ్చిన శిఖర్ ధవన్ మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మ్యాచ్‌లో బ్యాట్ పట్టుకున్నప్పటికీ.. కేవలం 1 పరుగుకే షెల్డన్ కాట్రెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 24 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే చెరో 19 పరుగులు చేశారు. బౌలర్లలో 4 ఓవర్లు వేసిన నవ్‌దీప్ సైనీ 1 ఓవర్ మెయిడిన్ చేయడంతోపాటు 17 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సైనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా, రవీంద్రజడేజాలకు చెరో వికెట్ దక్కింది.

Trending News