ఐఆర్‌సీటీసీ హోటల్స్ స్కాంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆగస్టు 31న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ స్కాం చేసినట్లు ఈ ఏడాది ఏప్రిల్ 16న కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఆయన కుటుంబ సభ్యులతో సహా 14 మంది పేర్లను ప్రస్తావించింది.
చార్జిషీట్‌లో లాలూ, ఆతని కుటుంబ సభ్యులే కాక.. మాజీ కేంద్రమంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, ఐఆర్‌సీటీసీ డైరెక్టర్లు బీకె అగర్వాల్, రాకేష్ సక్సేనా, జనరల్ మేనేజర్లు వీకే ఆస్తానా, ఆర్ కే గోయల్, విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్ (సుజాతా హోటల్స్ డైరెక్టర్లు) పేర్లను ప్రస్తావించింది.
Delhi Court issues summons to RJD leader Lalu Prasad Yadav and son Tejashwi Yadav,wife Rabri Devi and others as accused in alleged irregularities in granting operational contracts of two IRCTC hotels to a private firm.
— ANI (@ANI) July 30, 2018
ఈ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ కేసు నమోదు చేసింది. రాంచి, పూరీలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఐఆర్‌సీటీసీ నిర్వహించే రెండు హోటళ్లను సుజాతా హోటల్స్ అనే ప్రవేట్ సంస్థకు కట్టబెడుతూ ప్రతిఫలంగా పాట్నాలో బినామీ కంపెనీ పేరుతో మూడు ఎకరాల అత్యంత విలువైన స్థలాన్ని (సుమారు రూ.45 కోట్లు) పొందారని లాలూపై ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు హోటళ్లను క్విడ్ ప్రోకో కింద ఆ సంస్థకు అప్పగించినట్లు.. టెండర్ దక్కగానే ఆ స్థలం లాలూ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.