Komatireddy Rajagopal Reddy: ఇటీవలే బీజేపిలో చేరిన చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మళ్లీ ప్లేటు ఫిరాయించారు. తన అనుచరులతో కలిసి సమావేశమైన కర్నాటి వెంకటేశం.. బీజేపికి గుడ్ బై చెప్పడంతో పాటు పోతుపోతూ ఆ పార్టీని ఇరుకున పెట్టేలా పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా బీజేపీలో చేర్చుకున్నారని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని డిఫెన్స్‌లో పడేసేలా మాట్లాడారు. తాను బీజేపీలో చేరడానికి గట్టుప్పల మండలం ఏర్పాటుకు సంబంధించి అప్పట్లో నోటిఫికేషన్ రాకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చిన కర్నాటి.. ఆ తర్వాత గట్టుప్పల మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్ రావడం, ఆఫీసులు ఓపెన్ కావడంతో మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిపారు.
మన ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆరే స్వయంగా తనను టిఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని.. కేటీఆర్ సహకారంతో భవిష్యత్తులో గట్టుప్పల మండలంను గొప్పగా అభివృద్ది చేసుకోవచ్చన్నారు. గట్టుప్పల మండలంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి మెజార్టీ చూపిస్తే.. ప్రభుత్వం సహకారంలో మన గ్రామం అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని కర్నాటి వెంకటేశం తన అనుచరవర్గానికి సూచించారు.
ప్రభుత్వం గట్టప్పలను మండలంగా ప్రకటించింది కనుక టిఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని చెబుతూ స్థానిక కార్యకర్తల మనసు మార్చి, వారిని టీఆర్ఎస్ వైపు తిప్పే పనిలో కర్నాటి వెంకటేశం బిజీ అయ్యారు. ఇదంతా చూస్తోంటే.. కొత్తగా ప్రకటించిన మండలంలో ఓట్లను టీఆర్ఎస్ కి వేయించే బాధ్యతను కర్నాటి వెంకటేశం తీసుకున్నట్టే అర్థమవుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే వారు గెలవాలంటే.. ఆ నియోజకవర్గం పరిధిలోని ప్రతీ మండలం వారికి కీలకమే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రకటించిన మండలంలో ఓట్లను కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ వేసిన స్కెచ్ కూడా పనికొచ్చేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.