హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (భాజపా) తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయనపై ఎవరో గుర్తుతెలియని వ్యత్ఖులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాజాసింగ్‌పై ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నం జరిగినట్లు బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో సభకు హాజరయ్యారు. సభ ముగించుకొని అర్ధరాత్రి ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.మార్గ మధ్యలో ఆయన కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. కారు డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో.. రాజాసింగ్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారు కావడంతో.. లారీ క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ప్రమాదానికి పథకం వేసి ఉండొచ్చునని ఆయన భావిస్తున్నారు. లారీతో తన కారును ఢీకొట్టాలని చూశారని ఆయన ఆరోపించారు. తన కారు డ్రైవర్ అప్రమత్తత వల్లే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని రాజాసింగ్ తెలిపారు.