న్యూ ఢిల్లీ: Rajya Sabha election రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్‌లో ( Gujarat ) మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్ ( Akshay Patel ), జీతూ భాయ్ చౌదరి ( Jitu Bhai Chaudhary ) తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి లేఖలు పంపారు. వారి రాజీనామాలను స్పీకర్ సైతం ఆమోదించారు. ఇప్పటికే మార్చి నెలలో ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం తగ్గిపోగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేయడం.. వెనువెంటనే వారి రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తాకినట్టయింది. ( ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల )
కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాపై గాంధీనగర్‌లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది స్పందిస్తూ.. ఆ ఇద్దరితో మాట్లాడటం జరిగిందని.. వారు తమంతట తామే స్వచ్చందంగా రాజీనామా చేశారని అన్నారు. రాజీనామాలపై విచారణ చేపట్టగా.. ఇందులో ఎవరి బలవంతం లేదని తెలిసిందని.. అందుకే వారి రాజీనామాలను ఆమోదించడం జరిగిందని రాజేంద్ర త్రివేది తెలిపారు. గుజరాత్‌లో వరుసగా రాజీనామాలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిరోధించడం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తలనొప్పిగా మారింది.
ఏడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు గాను జూన్ 19న ఓటింగ్ జరగనుంది. గుజరాత్లో 4 రాజ్యసభ స్థానాలకు గాను పోలింగ్ జరగనుండగా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు, బీజేపి ( BJP ) మూడు స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు మార్చి 26నే జరగాల్సి ఉన్నప్పటికీ.. అప్పుడు కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అప్పుడు వాయిదా పడిన ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
గుజరాత్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపి, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతుండగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుస రాజీనామాలు సమర్పిస్తుండటంతో ఆ పార్టీ పోటీ చేసిన రెండు స్థానాలు గెలవడం కూడా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..