Group 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డి

Arrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 17, 2024, 04:57 PM IST
Group 1 Mains: గ్రూప్‌ 1పై ముందుకే తెలంగాణ సర్కార్‌.. తగ్గేదెలే అంటున్న రేవంత్‌ రెడ్డి

Group 1 Mains Exam: గ్రూప్‌ 1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. వేలాది మంది భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశాన్ని పట్టించుకోకుండా పరీక్ష నిర్వహణకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సిద్ధమైంది. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాట్లు శరవేగంగా చేస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయంలో ప్రభుత్వం సమీక్ష చేపట్టి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read: KTR Group 1 Aspirants: అర్ధరాత్రి గ్రూప్‌ 1 అభ్యర్థుల మొర.. వస్తున్నా అంటూ కేటీఆర్‌ ట్వీట్

ఈనెల 21 నుంచి 27 వ తేదీ వరకు జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష చేశారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి చైర్మన్ డాక్టర్‌ మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా.. సచివాలయంలో డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్‌ ఎండీ ముష్రాఫ్ అలీ, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు సీఎస్‌ స్పష్టం చేశారు.

Also Read: IAS Officers: ఐఏఎస్‌లకు దెబ్బ మీద దెబ్బ.. ఏపీకి వెళ్లాల్సిందేనని చెప్పిన హైకోర్టు

 

ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు రాయనుండగా.. 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమిషనర్లు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని చెప్పారు. 

అపోహాలు నమ్మొద్దు
ఈ సమావేశంలో టీజీపీఎస్సీ చైర్మన్ డాక్టర్‌ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2011 తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకున్నదని గుర్తుచేశారు. పరీక్షలపై ఎలాంటి అపోహలు, పుకార్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లుచేస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు.

ఒకటిన్నర తర్వాత ప్రవేశం నిషేధం
ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రతినిధులు తెలిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  డౌన్‌లోడ్ చేసుకున్నారని.. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

పరీక్ష వివరాలు..
పరీక్ష రాసే అభ్యర్థులు 34,383 మంది
పరీక్ష కేంద్రాలు: 46 (హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News