హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంతో దూకుడుగా వ్యవహరించిన ఆ పార్టీ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత కొంత స్పీడ్ తగ్గించారు. అయితే, త్వరలోనే లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి రేవంత్ రెడ్డి పేరు తెరపైకొస్తోంది. తెలంగాణలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డిని పోటీకి దింపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ విషయానికొస్తే, మహబూబ్నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున మళ్లీ జితేందర్ రెడ్డినే పోటీ చేయనున్నారని సమాచారం. బీజేపీ సైతం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్తో పాటు చేవెళ్ల పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.