కోదంరాం పార్టీ అలకతో మహాకూటమిలో నీలినీడలు కమ్ముకున్నాయి. తాము కోరుతున్న సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ తీరుపై టీజేఎస్ గుర్రుగా ఉంది. కోదండరాం పార్టీకి 6-7 సీట్లు మాత్రమే కాంగ్రెస్ ఇస్తామంటుంటే.. కోదండరాం పార్టీ మాత్రం 15 సీట్లకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్ పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడంతో కోదండారం నివాసంలో టీజేఎస్ స్టీరింగ్ కమిటీ అత్యవసరం సమావేశం నిర్వహించింది. తమ డిమాండ్ కు తలొగ్గి 15 సీట్లు ఇస్తే సరి..లేకుంటే కూటమి నుంచి బయటికి వెళ్లాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయాన్నివ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ భేటీలో తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
డిప్యూటీ సీఎం ఆఫర్ !
మరోవైపు కోదండరాం పార్టీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రారంభించింది. గెలిచే ఆస్కారం ఉన్న సీట్లు మాత్రమే తాము ఇస్తామని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనికి టీజేఎస్ ససేమిరా అంటోంది. తాము ఆఫర్ చేస్తున్న సీట్లు తీసుకుంటే కోదండరాంకు రాజ్యసభ సీటు లేదా డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆఫర్ కు కోదండాం పార్టీ లొంగుతుందా.. లేదంటే సొంతగా పోటీ చేయాలని నిర్ణయిస్తుందా అనేది తేలాల్సి ఉంది.